ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ లో  టీమిండియా ఆరంభంనుండి అదరగొట్టిన విషయం తెలిసిందే. లీగ్ దశలో వరస విజయాలను అందుకుని టాప్ లో నిలిచిన భారత జట్టు సెమీఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. మాంచెస్టర్ వేదికన జరిగన సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడ్డ కోహ్లీసేన 18 పరుగులు తేడాతో ఓటమిపాలయ్యింది. ఇలా కీలక మ్యాచ్ లో ఓటమిపాలై టోర్నీ నుండి నిష్క్రమించిన భారత జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దుతుగా నిలిచారు. 

టీమిండియా సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఓడిపోవడం కాస్త బాధించినా...ఆటగాళ్లు గెలుపుకోసం పడిన తాపత్రయం తననెంతో ఆకట్టుకుందన్నారు. '' ఫలితం నిరాశపర్చింది కానీ  చివరి బంతి వరకు గెలుపుకోసం పోరాడిన టీమిండియా ఫైటింగ్ స్పిరిట్ అద్భుతంగా వుంది. మొత్తం ప్రపంచ కప్ టోర్నీలో ఇండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అదిరిపోయింది. ఈ ఆటతీరు మనల్ని(భారతీయుల్ని) ఎంతో గర్వపడేలా చేసింది. 

జీవితంలో గెలుపు, ఓటములు చాలా సహజమైనవి. కాబట్టి న్యూడిలాండ్ తో జరిగిన ఈ సెమీఫైనల్ ఓటమి బాధ నుండి భారత ఆటగాళ్ళు తొందరగా బయటకు రావాలి. భవిష్యత్ లో టీమిండియా ఆడబోయే అన్ని మ్యాచుల్లోనూ విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను...బెస్ట్ విషెస్'' అంటూ ప్రధాని మోదీ టీమిండియా సెమీఫైనల్ ఓటమిపై స్పందించారు. 

ప్రపంచ కప్ లీగ్ దశలో అద్భుతంగా ఆడిన టీమిండియా సెమీఫైనల్లో చతికిలపడింది. గత మంగళవారం న్యూజిలాండ్ తో మొదలైన సెమీస్ వర్షం కారణంగా  బుధవారానికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే మొదటిరోజు 46.1 ఓవర్లలో 211 పరుగులు చేసిన కివీస్ రెండో రోజు  మరో 28 పరుగులు జోడించి భారత్ కు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

అయితే లక్ష్యఛేదనలో భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు కేవలం తలో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యారు. అయితే మధ్యలో రిషబ్ పంత్ 32, హార్దిక్ పాండ్యా 32 పరుగులతో ఆదుకున్నారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా-ధోని జోడి సెంచరీ భాగస్వామ్యంతో భారత్ గెలుపుపై ఆశలు రేకెత్తించారు. కానీ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా కీలక సమయంలో ఔటయ్యాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసిన ధోని కూడా  216 పరుగుల వద్ద రనౌటయ్యాడు. దీంతో  భారత గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. 18 పరుగుల తేడాతో గెలిచిన కివీస్ వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ కు చేరింది.