అంతర్జాతీయ క్రికెట్లో కేవలం అత్యుత్తమ ఆటతీరుతోనే అభిమానులు, మీడియా దృష్టికి ఆకర్షించే ఆటగాళ్లు చాలా తక్కువమంది వుంటారు.  అలా కాకుండా  మైదానంలో వింత చేష్టలతో, దురుసు ప్రవర్తన, కేవలం వివాదాస్పదాలతోనే కొందరు అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకునేలా చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. ఇక వింత బౌలింగ్ యాక్షన్, బ్యాటింగ్ స్టైల్, డిఫరెంట్ హెయిర్ స్టైల్,టాటూలు ఇలా ఏదో రకంగా అభిమానులను ఆకట్టుకునే వారు మరికొందరు. వీరు మరీ అంత చీఫ్ గా ప్రవర్తించరు. అలాకాకుండా ఉన్నత ఆలోచనలు, అంకిత భావం, దేశంపై ప్రేమ ఇలాంటి వాటితో అభిమానుల మనసులను కొల్లగొట్టే ఆటగాళ్లు మాత్రం చాలా అరుదుగా వుంటారు. అలాంటి  ఆటగాడే వెస్టిండిస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్. 

వెస్టిండిస్ జట్టు తరపున కాట్రెల్ ప్రస్తుతం ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొంటున్నాడు.  పాకిస్థాన్, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులకు అతడంటే చాలా మందికి  తెలీదు. కానీ ఈ మ్యాచుల్లో వికెట్ పడగొట్టిన తర్వాత అతడు ప్రత్యేకంగా జరుపుకునే సంబరాలు అభిమానులను ఆకట్టుకుంది. వికెట్ తీసిన వెంటనే మార్చ్ పాస్ట్ చేస్తూ అంపైర్, సహచరులు, డ్రెస్సింగ్ రూం వైపు చూస్తూ సెల్యూట్ చేయడం అతడి స్టైల్. దీంతో అభిమానులు అతడు ఎందుకలా సంబరాలు చేసుకుంటాడో  తెలుసుకోడాని ఆసక్తి చూపిస్తున్నారు. 

అయితే ఇలా ప్రత్యేకంగా సంబరాలు చేసుకోవడం వెనకున్న సీక్రెట్ ను తాజాగా కాట్రెజ్ స్వయంగా బయటపెట్టాడు. '' నేను మా దేశ రక్షణ  వ్యవస్థలో పనిచేస్తున్నాను. జమైకా డిఫెన్స్ ఫోర్స్ లో సైనికుడిగా విధులు కూడా నిర్వర్తించాను. ఆ సమయంలో ప్రత్యేకంగా ఆరునెలల పాటు ఇలా మార్చ పాస్ట్, సెల్యూట్ చేయడం సాధన చేశాను. అయితే క్రికెటర్ గా మారిన తర్వాత ఈ మిలటరీ సెల్యూట్ ను కొనసాగించాలనుకున్నాను. అందువల్లే వికెట్ తీసిన వెంటనే నా ఆనందాన్ని ఇలా వ్యక్తపరుస్తున్నాను.'' అని కాట్రెల్ వివరించాడు.