ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఇవాళ( సోమవారం) వెస్టిండిస్-బంగ్లాదేశ్ లు తలపడుతున్నాయి. టౌన్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్వంసకర ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోతకోయగల బ్యాట్ మెన్  క్రిస్ గేల్ డకౌటయ్యాడు. క్రీజులో  అడుగుపెట్టినప్పటి నుండి తడబడుతూనే 13 బంతులను ఎదుర్కొన్న అతడు ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు. అ క్రమంలో తీవ్ర అసహానికి గురైన అతడు సైఫుద్దిన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. 

ఇలా  బంగ్లా బౌలర్లను  ఎదుర్కోవడంలో విఫలమై సున్నా పరుగులకే ఔటైన గేల్ ఖాతాలోకి ఓ చెత్త రికార్డు చేరింది. ఇప్పటివరకు వన్డేల్లో 25  సార్లు డకౌటైన ఆటగాడిగా గేల్ రికార్డు  సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధికసార్లు డకౌటయిన రికార్డు లంక క్రికెటర్ జయవర్ధనే పేరిట వుంది. అతడు 34 సార్లు డకౌటయ్యాడు. వన్డేల్లో అత్యధికసార్లు డకౌటయిన వారి జాబితాలో  గేల్ ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. 

అయితే ఇలా ఆరు పరుగల వద్దే కీలకమైన గేల్ వికెట్ ను కోల్పోయిన విండీస్ కు మరో ఓపెనర్ లూయిస్ ఆదుకున్నాడు. అతడు బంగ్లా  బౌలర్లను దీటుగా ఎదుర్కొని అర్థశతకాన్ని నమోదు చేసుకున్నాడు. హోప్స్ తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన లూయిస్ 70 పరుగుల వద్ద ఔటయ్యాడు. హోప్స్ కూడా  హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో ప్రస్తుతం విండీస్ 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 151 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది.