విరాట్  కోహ్లీ మైదానంలో ఎంత సీరియస్ గా వుంటాడో మనందరికి తెలుసు. కొన్నిసార్లు తన అసహనాన్ని ఆటగాళ్లు, అంపైర్లపై  కూడా ప్రద్రర్శిస్తుంటాడు. దీంతో అతడికి  అగ్రెసివ్ కెప్టెన్ అన్న పేరు వచ్చింది. అయితే అతడు మైదానంలో ఎంత సీరియస్ గా వుంటాడో అంతకంటే  ఎక్కువ సరదాగా డ్రెస్సింగ్ రూంలో వుంటాడని పలువురు ఆటగాళ్లు చెబుతుండగా విన్నాం. కానీ తాజాగా చాహల్ టీవి కోహ్లీ ఆటగాళ్లతో ఎంత సరదాగా వుంటాడో ప్రత్యక్షంగా చూపించింది. అనుకోకుండా జరిగిన సంఘటనే అయినా దీని ద్వారా కెప్టెన్ కోహ్లీ,యువ ఆటగాళ్లకు మధ్య వున్న సాన్నిహిత్యం బయటపడింది. 

ఇప్పటికే ప్రపంచ కప్ టోర్నీలో సెమీఫైనల్ కు టీమిండియా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా శ్రీలంకతో మ్యాచ్ కు మరో రెండు రోజుల సమయం వుండటంతో టీమిండియా ఆటగాళ్ళు సరదాగా గడుపుతున్నారు. ఈ  క్రమంలోనే స్పిన్ బౌలర్ యజువేందర్ చాహల్ ఎప్పటిలాగే తన చాహల్ టీవి  కోసం ఓపెనర్ కెఎల్ రాహుల్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ షూట్ సందర్భంగా సరదా సంఘటన చోటుచుసుకుంది. 

రాహుల్ ను చాహల్ ఇంటర్వ్యూ చేస్తున్న విషయాన్ని  గమనించిన కోహ్లీ సరదాగా వారిని డిస్టర్బ్ చేయాలని అనుకున్నాడు. దీంతో ఇంటర్వ్యూ  మధ్యలో వెళ్లి రాహుల్ ను ఏదో అడిగాడు. దీంతో  కెమెరాను కోహ్లీ వైపు తిప్పించిన చాహల్...'' కావాలనే ఇలా చేశావ్ కదా కోహ్లీ భయ్యా. చాహల్ టీవిలో కనిపించాలన్న ఆతృతతో ఈ వీడియోలో కనిపించాలనుకున్నావు. ఈ టీవిలో కనిపించాలని ప్రజలు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో చూడండి'' అంటూ  కోహ్లీని  ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. 

అయితే కోహ్లీ మాత్రం తాను కావాలని ఇలా చేయలేదని...రాహులే నన్ను పిలిచాడంటూ బుకాయించాడు. ఇలా వీరిమధ్య సరదా  సంభాషణ సాగింది. ఈ సంఘటన తర్వాత కోహ్లీ అక్కడినుండి వెళ్లిపోగా ఇంటర్వ్యూ  కొనసాగింది. 

అయితే ఆటగాళ్ల మధ్య జరిగిన సరదా  సంఘటనకు సంబంధించిన ఈ వీడియోనే బిసిసిఐ అధికారికి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అది కాస్తా అభిమానులకు, నెటిజన్లకు తెగ నచ్చడంతో వైరల్ గా మారింది.