ప్రపంచ కప్ టోర్నీలో విశ్వవిజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలున్న జట్టు టీమిండియా. ఆ విషయం భారత జట్టు లీగ్ దశలో సాధించిన వరుస విజయాలను చూస్తేనే అర్థమవుతుంది. కానీ ప్రతికూల పరిస్థితులు, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల భారత్ ఈ మెగాటోర్నీని అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో జరిగిన పోరులో పోరాడిఓడిన కోహ్లీసేన టైటిల్ పోరుకు అర్హత  సాధించలేకపోయింది. అయితే ఈ మ్యాచ్ కు  ముందు జరిగిన పరిణామాలే టీమిండియా ఓటమికి కారణమని అభమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

మరీముఖ్యంగా వర్షం కారణంగా పిచ్ లో చోటుచేసుకున్న మార్పులే భారత జట్టు ఓటమికి ప్రధాన కారణమన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే పిచ్ లో చోటుచేసుకున్న మార్పులను ముందుగానే గుర్తించిన కోహ్లీ కొన్ని వ్యూహాలను రచించాడట. కానీ చివరి నిమిషంలో తన ప్రణాళికను పక్కనబెట్టి రెగ్యులర్ ఫార్మాట్ నే ఫాలో అయ్యాడు కాబట్టే టీమిండియా ఓటమి తప్పలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఈ మ్యాచ్ ఆరంభానికి ముందే కోహ్లీ బ్యాటింగ్ లైనప్ లో కొన్ని మార్పులు చేయాలని అనుకున్నాడట. మొదటి  పది ఓవర్లపాటు కీలకమైన వికెట్లు కాపాడుకోవడం చాలా కీలకం. అలాగే పరుగులు కూడా సాధించాల్సివుంటుంది. కాబట్టి ఓపెనర్లను యధావిదిగా బరిలోకి  దింపి తాను మాత్రం నాలుగోస్థానంలో బరిలోకి దిగాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని చీఫ్ కోచ్ రవిశాస్త్రి, సహాయ  కోచ్ సంజయ్ బంగర్, సీనియర్ ప్లేయర్ ధోనికి కూడా తెలిపాడు. కానీ రోహిత్  తొందరగా  ఔటవడంతో తన వ్యూహాలన్నింటిని పక్కనబెట్టి కోహ్లీనే బరిలోకి దిగాల్సి వచ్చిందట.

న్యూజిలాండ్ తో మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ ముందుగానే అప్రమత్తమైనా తన ఆలోచనలను అమలుచేయలేకపోయాడు. ఒకవేళ అతడు నాలుగో స్థానంలో బరిలోకి దిగుంటే ఫలితం మరోలా వుండేదని...తప్పకుండా టీమిండియా గెలిచేచి ఫైనల్ కు చేరేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.   

కోహ్లీ ఊహించినట్లే మొదటి పది ఓవర్లు ఈ మ్యాచ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ పది ఓవర్లలో భారత్ కేవలం 24 పరుగులు మాత్రమే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఇలా మొదటి పవర్ ప్లే లోనే టీమిండియా  ఓటమి ఖరారయ్యింది. అయితే చివర్లో ధోని, జడేజా  జోడీ అద్భత భాగస్వామ్యాన్ని నెలకొల్పినా జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయారు.