భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో 87 ఏళ్ల చారులత పటేల్ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.  ఏకంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ఆమె దగ్గరకు వెళ్లి పలకరించడంతో అందరి దృష్టి ఆమెపైకి మళ్లింది. పెద్ద పెద్ద సెలబ్రెటీలకు కూడా దక్కని అవకాశం ఈమెకు దక్కింది. ఈ వయసులో కూడా క్రికెట్ పై మక్కువతో మైదానానికి రావడం అభిమానులనే కాదు ఆటగాళ్లను కూడా కదిలించింది. దీంతో ఈ టీమిండియా సూపర్ ఫ్యాన్ కు కోహ్లీ ఓ మాటిచ్చాడు. తాజాగా ఆ మాటను కు నిలబెట్టుకున్నాడు. 

లీడ్స్ వేదికగా భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చారుతల సందడి కనిపించింది. అయితే ఆమెకు ఈ  మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కోహ్లీ  కల్పించాడట. గత మ్యాచ్ లో ఆమెను కోహ్లీ కలిసినపుడు ''తర్వాతి మ్యాచ్ కు కూడా మీరు రావాలి. అందుకోసమయ్యే టికెట్ ఖర్చులను నేను భరిస్తాను. మీరు మైదానానికి వచ్చి మాకు మద్దతిస్తే చాలు'' అని చెప్పాడు. ఇచ్చిన మాటకే కట్టుబడి మ్యాచ్ టికెట్ తో ఆమె జట్టుపై చూపిస్తున్న ప్రేమను కొనియాడుతూ  రాసిన ఓ లెటర్ ను కోహ్లీ పంపించాడట. ఈ విషయాన్ని బిసిసిఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 

 ''హలో చారుతల గారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తర్వాతి మ్యాచ్ టికెట్స్ అందిస్తానని ఆమెకు ప్రామిస్ చేశాడు. ఆ మాటను నిలబెట్టుకోవడం వల్ల ఆమె లీడ్స్ లో వున్నారు'' అంటూ బిసిసిఐ ట్వీట్ చేసింది. ఇండియా-శ్రీలంక మ్యాచ్ ను ఆమె ప్రత్యక్షంగా వీక్షిస్తున్న పోటోతో పాటు కోహ్లీ రాసిన ఉత్తరానికి సంబంధించిన పోటోను బిసిసిఐ ఈ ట్వీట్ కు జతచేసింది.