ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయాల కారణంగా ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు దూరమవ్వగా ఆ జాబితాలోకి మరో ప్లేయర్ చేరాడు. టీమిండియాలో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగుతున్న ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నిన్న(ఆదివారం) ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ కు దూరమైన విషయం తెలిసిందే. అయితే అతడి కాలి గాయం మరింత ఎక్కువ  అవడంతో కేవలం ఈ మ్యాచ్ కు కాదు ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు బిసిసిఐ ప్రకటించింది. 

గతంలో సహచరులతో  కలిసి నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్న సమయంలో విజయ్ గాయపడ్డాడు. బుమ్రా విసిరిన యార్కర్ ను అతడు అంచనావేయలేక పోయాడు. దీంతో  వేగంగా దూసుకొచ్చిన బంతి నేరుగా విజయ్ కాలిని గాయపర్చింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడి మైదానాన్ని వీడాడు.  

అయితే ఆ తర్వాత అతడు  కోలుకుని అప్ఘాన్, వెస్టిండిస్ తో జరిగిన మ్యాచుల్లో పాల్గొన్నాడు. దీంతో అందరు అతడి గాయం గురించి మరిచిపోయారు. ఇలాంటి సమయంలో మళ్ళీ అతడు గాయం కారణంగా ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమవుతున్నట్లు ప్రకటించి టీమిండియా మేనేజ్ మెంట్ సంచలనం సృష్టించింది. 

ఇప్పటికే భారత జట్టులో కీలక ఆటగాడు, ఓపెనర్ శిఖర్ ధవన్ బొటనవేలి గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. అలాగే తొడ కండరాల గాయంతో బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఇలా ఇప్పటికే కీలక ఆటగాళ్ల గాయాలు టీమిండియాకు సమస్యగా మారగా తాజాగా విజయ్ శంకర్ గాయంతో దూరమవడం మరింత ఆందోళనలోకి నెట్టింది. 

విజయ్ శంకర్ టోర్నీకి దూరమవడంతో అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారా అన్న దానిపై  ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్ కు చోటు కల్పించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.