ప్రపంచ కప్ టోర్నీకి ముందునుండి టీమిండియాను మిడిల్ ఆర్ఢర్ సమస్య వేదిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎంతో కీలకమైన నాలుగో స్థానంలో ఏ ఆటగాడు సరిగ్గా రాణించలేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో ఎలా గట్టుక్కుతామా అని సెలెక్టర్లు, ఆటగాళ్లు, మాజీలనే కాదు అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా నాలుగో స్థానంలో సమర్థవంతంగా బ్యాటింగ్ చేయగల ఆటగాడు దొరికాడంటూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఇక భవిష్యత్ లో కూడా టీమిండియాకు ఈ స్థానంలో బ్యాటింగ్ పై ఆందోళన వుండదన్నాడు. రిషబ్ పంత్ ఈ స్థానంలో చక్కగా ఫిట్ అవుతానని బంగ్లా మ్యాచ్ ద్వారా నిరూపించుకున్నాడని యువీ వెల్లడించాడు. 

''మొత్తానికి టీమిండియాకు నెంబర్ 4  స్థానంలో ఆడే బ్యాట్ మెన్ దొరికేశాడు. ఈ ప్రపంచ కప్ లోనే కాదు భవిష్యత్ లో కూడా నాలుగో స్థానం రిషబ్ పంత్ దే.  అతన్ని సరిగ్గా ఉపయోగించుకోవడమే ఇక మిగిలింది'' అంటూ యువీ బంగ్లాదేశ్ తో మ్యాచ్ అనంతరం ట్వీట్ చేశాడు. 

మొదట ఈ ప్రపంచ కప్ టోర్నీలో నాలుగో స్థానంలో రాహుల్ ఆడాడు. అయితే శిఖర్ ధవన్ గాయంతో అతడు ఓపెనింగ్  చేయాల్సి రాగా విజయ్ శంకర్ ఆ స్థానంలోకి మారాడు.  అయితే రాహుల్ కాస్త పరవాలేదనిపించినా విజయ్ మాత్రం ఈ స్థానంలో తేలిపోయాడు. తాజాగా గాయంతో విజయ్ కూడా జట్టుకు దూరమవడంతో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ నాలుగో స్థానంలో బరిలోకి దిగి 48 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇలా ఇప్పటివరకు ఈ  స్థానంలో ఆడిన అందరిలోనూ రిషబే బెటర్  గా ఆడాడంటూ ప్రశంసిస్తున్నారు. 

అయితే యువరాజ్ సింగ్ గతంలోనూ ఈ నాలుగో స్థానంలో రిషబ్ ను ఆడించాలని సూచించాడు. పంత్ చాలా టాలెంటెడ్ ఆటగాడని...భవిష్యత్ లో భారత జట్టులో ప్రధాన ఆటగాడికి ఎదుగుతాడని ఇదివరకే తెెలిపాడు.తాను అనుకున్నట్లుగా రిషబ్ నాలుగో స్థానంలో బరిలోకి దిగి రాణించడం  పట్ల యువీ తాజాగా ఆనందం వ్యక్తం చేశాడు.