టీమిండియా ప్రపంచ కప్ జట్టులో ఆల్ రౌండర్ కోటాలో అనూహ్యంగా చోటు దక్కించుకున్న ఆటగాడు విజయ్ శంకర్. ఈ మెగా టోర్నీకి ముందు అత్యుత్తమ ప్రదర్శనలో సత్తాచాటిన అంబటి రాయుడిని కాదని ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విజయ్ ని జట్టులోకి తీసుకుంది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ విమర్శలను తిప్పికొడుతూ విజయ్ త్రీ డైమెన్షన్( బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ప్లేయర్ అని... ఇంగ్లాండ్ వంటి  పిచ్ లపై అతడు అవసరపడతాడనే ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు వెనకేసుకు వచ్చిన విషయం తెలిసిందే. 

అయితే సెలెక్టర్ల నమ్మకాన్ని వమ్ముచేస్తూ ప్రపంచకప్ టోర్నీలో విజయ్ శంకర్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచులాడిన శంకర్ కేవలం పాకిస్థాన్ తో మ్యాచ్ లో మాత్రమే 2 వికెట్లు పడగొట్టి పరవాలేదనిపించాడు. ఇక అప్ఘాన్, వెస్టిండిస్ తో జరిగిన మ్యాచుల్లో బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించలేకపోయాడు. ముఖ్యంగా అతడు ఎంతో కీలకమైన  నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతూ విఫలమవడం మాజీలు, అభిమానులు, విశ్లేషకులను నిరాశకు గురిచేసింది. దీంతో వారు విజయ్ పై, అతడికి అండగా నిలిచిన సెలెక్షన్ కమిటీపై విమర్శల  వర్షం కురిపిస్తున్నారు. 

విజయ్ శంకర్ ఆటతీరుపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన మంజ్రేకర్ '' వెస్టిండిస్ పై టీమిండియా ఘన విజయం సాధించడం  ఆనందంగా  వుంది. కానీ ఇదే సమయంలో మరోసారి జట్టులో బ్యాటింగ్ లోపాలు  భయపడటం ఆందోళనకరమైన విషయం.  ముఖ్యంగా ఆరంభంలో కెఎల్ రాహుల్ తీవ్ర ఒత్తిడి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇక వరుసగా విఫలమవుతున్న విజయ్ శంకర్ కు మరో ఛాన్స్ మాత్రమే లభించే అవకాశముంది'' అని పేర్కొన్నాడు.  

 కీలక మ్యాచుల్లో ఆశించిన మేర రాణించలేకపోవడంతో విజయ్ శంకర్ ను టీంమేనేజ్ మెంట్ పక్కనపెట్టవచ్చన్నది మంజ్రేకర్ అభిప్రాయం. ఒకవేళ అతడి అభిప్రాయమే నిజమేతే రిషబ్ పంత్ కు తుది జట్టులో చోటు దక్కవచ్చు.