ఈ ప్రపంచ కప్ తెలుగు ప్రజలకు ఛేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఈ మెగా టోర్నీలో చోటు దక్కించుకోలేక మనస్థాపానికి గురైన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఇవాళ(బుధవారం) సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి తాను రిటైరవుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లతో పాటు బిసిసిఐ నిర్వహించే ఐపిఎల్ కు కూడా గుడ్ బై చెబుతున్నట్లు రాయుడు వెల్లడించాడు. ఇలా రాయుడు అర్థాంతరంగా క్రికెట్ నుండి వైదొలగడంపై క్రికెట్ ప్రియులు, టీమిండియా మాజీలు స్పందిస్తున్నారు. ఈనిర్ణయం తమనెంతో బాధిస్తోందని వారు పేర్కొంటున్నారు. 

తాజాగా మాజీ టీమిండియా ప్లేయర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా రాయుడు రిటైర్మెంట్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే అతడు భవిష్యత్ లో మరింత ఆనందంగా వుండాలని కోరుకుంటున్నట్లు ఓ ట్వీట్ చేశాడు. '' రాయుడు రిటైర్మెంట్ వార్త నన్నెంతో బాధించింది.  ప్రపంచ కప్ కోసం ఎంపికచేసిన భారత జట్టులో అతడు ఎంపిక కాకపోవడం చాలా బాధాకరం. అతన్నలా బాధించాల్సింది కాదు. అయితే రిటైర్మెంట్ తర్వాత రాయుడు జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నా.'' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. 

ప్రపంచ కప్ కు ముందు అంబటి రాయుడు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో చాలా బాగా రాణించాడు. దీంతో ప్రపంచ కప్ లో ఆడే అవకాశం వస్తుందని భావించిన అతడికి నిరాశే ఎదురయ్యింది. అతన్ని కాదని సెలెక్టర్లు తమిళనాడు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కు అవకాశమిచ్చారు.  అయితే తాజాగా విజయ్ గాయం కారణంగా ప్రపంచ కప్ కు దూరమవగా రాయుడు మరోసారి అవకాశం  వస్తుందని ఆశించాడు. ఈసారి కూడా అతన్ని కాదని టీమిండియా సెలెక్టర్లు మయాంక్ ను ఎంపిక చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయిన రాయుడు తనకెంతో ఇష్టమైన క్రికెట్ కెరీర్ ను వదులుకున్నాడు.