ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. దాయాది పాకిస్థాన్ జట్టును మరోసారి మట్టికరిపించిన భారత జట్టు ఈ మెగా టోర్నీలో  వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. అయితే టీమిండియా చేతిలో పాక్ ఓటమిని తాను ముందుగానే ఊహించానని పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ వెల్లడించారు. సీనియర్లు అందించే అనుభవంతో కూడిన సలహాలను పాక్ స్వీకరించడంలేదని...అందువల్లే ఆ జట్టుకు సలహాలివ్వడం కూడా మానేశానంటూ అక్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ముఖ్యంగా నిన్న(ఆదివారం) జరిగిన మ్యాచ్ పాక్ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎందుకు ఎంచుకుందో  తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతున్నపుడు ఆ జట్టుకు బౌలింగే ప్రధాన బలం అవుతుంది. అలాంటపుడు మొదట బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని వుంచాల్సింది. అప్పుడు ప్రత్యర్థి బ్యాట్ మెన్స్ ఒత్తిడికి గురయ్యేవారని... పాక్ బౌలర్లు సత్తా చాటే అవకాశాలుండేవని అక్రమ్ అభిప్రాయపడ్డారు. 

కానీ టాస్ రూపంలో కలిసివచ్చిన మంచి అవకాశాన్ని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ చేజేతులా దూరం చేసుకున్నాడని అన్నారు. టాస్ గెలిచిన వెంటనే పాక్ బ్యాటింగ్ కు దిగి భారత్ కు టార్గెట్ నిర్దేశించాలని తాను కోరుకున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ జట్టు మాత్రం అలా చేయలేదని...అందువల్లే ఓటమిని చవిచూసిందని అక్రమ్ పేర్కొన్నారు. 

పాక్ జట్టుకు తాను చాలా అంశాలపై సలహాలిచ్చేవాడినని...అయితే వాటిని వారు స్వీకరించేవారు కాదు. అందువల్ల సలహాలివ్వడమే మానేశానని అన్నారు. కానీ ఇలాంటి పరిస్థితులను చూస్తే సీనియర్లు ఇచ్చే అనుభవపూర్వక సలహాలు పాక్ స్వీకరిస్తే బావుండేదని అనిపిస్తుంటుందని అక్రమ్ అసహనం  వ్యక్తం చేశాడు.