ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్-కివీస్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ కు మంగళవారం వర్షం ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. మాంచెస్టర్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యమవక పోవడంతో ఇవాళ్టికి(బుధవారం) వాయిదా పడింది. అయితే ఇవాళ మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానంలో ఓ ఆసక్తికర  దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. 

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ హటాత్తుగా మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న భారత యువ బౌలర్ యజువేందర్ చాహల్ తో ఆయన కాస్సేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్పిన్నర్ గా వెలుగొందిన ఆయన నుండి చాహల్ క్రికెట్ పాఠాలను నేర్చుకున్నాడు. 

చాహల్ తో మాట్లాడుతున్నంత సేపు వార్న్ ఏవో సూచనలిస్తూ కనిపించాడు. ముఖ్యంగా ఏ సమయంలో ఎలా బౌలింగ్ చేయాలో వార్న్ నుండి చాహల్ కొన్ని కిటుకులు నేర్చుకున్నాడు. అలాగే బంతిని ఎలా పట్టుకుంటే ఎక్కువగా స్పిన్ అవుతుందో సలహాలిస్తూ వార్న్ కనపించాడు. 

ఇలా ఆసిస్ దిగ్గజం వార్న్ నుండి  వార్న్ సలహాలు, సూచనలు తీసుకుంటున్న ఫోటోలను బిసిసిఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.  దీంతో ఈ ట్వీట్ అభిమానులు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.  వార్న్ వంటి దిగ్గజం నుండి పొందిన సూచనలు చాహల్ కెరీర్ కు ఎంతో ఉపయోగపడతాయన్న అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.