ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా రేపు(ఆదివారం) భారత్-పాకిస్థాన్ ల ఉత్కంఠ పోరు జరగనుంది. స్వతహాగా ఇండో పాక్ మ్యాచంటేనే అభిమానులు అమితాసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ప్రపంచకప్ కు ముందు భారత్, పాకిస్థాన్  దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం ఈ మ్యాచ్ కు మరింత పబ్లిసిటీ కల్పించింది. ఈ మ్యాచ్ పై తీవ్రమైన చర్చ జరగడంతో పాటు కొందరు ఏకంగా పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ ను టీమిండియా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇలా వివిధ కారణాలతో ఇండో  పాక్ మ్యాచ్ కు గతంలో కంటే ఎక్కువగా హైప్ క్రియేటయ్యింది. 

అయితే ఇలా ఇండో పాక్ మ్యాచ్ కారణంగా ఇప్పటికే అనేక వివాదాలు చెలరేగగా తాజాగా వివాదానికి  తెరలేచింది. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ మ్యాచ్ కు హాజరవనుందని తెలియడంతో భారత అభిమానుల్లో మరో చర్చ మొదలయ్యిది. అదే ఆమె ఏ  జట్టుకు మద్దతిస్తారని. స్వతహాగా ఇండియన్  (హైదరబాదీ) అయిన సానియా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహమాడింది. కాబట్టి ఆమె మాంచెస్టర్ మ్యాచ్ లో మద్దతిస్తారో రేపు తేలనుంది. 

పాక్ క్రికెటర్ ను వివాహమాడినప్పటికి సానియా భారత్ తరపునే టెన్నిస్ ఆడుతోంది. కాబట్టి ఆమెను ఇంకా అంతర్జాతీయ  సమాజం కూడా ఓ భారతీయురాలిగానే గుర్తిస్తోంది.  కానీ ఇప్పుడు సానియా భర్తకు మద్దతిచ్చినా...అతడు ప్రాతినిధ్యం వహించిన పాక్ కు మద్దతిచ్చినా ఓ భారత  క్రీడాకారిణి పాక్ కు మద్దతిచ్చినట్లు వుంటుంది. ఇలా అంతర్జాతీయంగా వుండే క్రికెట్ అభిమానులకు తప్పుడు సంకేతాలు పోయే అవకాశం వుంది. 

ఇక భారత్ కు సపోర్ట్ చేయాల్సి వస్తే భర్త షోయబ్ కు వ్యతిరేకంగా వ్యవహరించాల్సి వస్తుంది. కాబట్టి సానియా రేపు మాంచెస్టర్ స్టేడియంలో ఎలా వ్యవహరిస్తారు...ఎవరికి మద్దతిస్తారో చూడాలని  ఇరు దేశాల అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.