ప్రపంచ కప్ టోర్నీలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి బలమైన జట్లపై అలవోకగా విజయాన్ని అందుకున్న టీమిండియా పసికూన అప్ఘానిస్థాన్ తో మాత్రం చెమటోడ్చి గెలవాల్సి వచ్చింది. అప్ఘాన్ ఇంచుమించు భారత్ ను  ఓడించినంత పని  చేసింది.  బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియా కేవలం 224 పరుగులకే చేతులెత్తేయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ధోని-జాదవ్ ల జోడీ బ్యాటింగే టీమిండియా స్కోరు తగ్గడానికి కారణమంటూ మాజీలు, క్రికెట్ విశ్లేషకులు వారిని  విమర్శిస్తున్న విషయం తెలిసిందే. 

ఇలా నత్తనడకన సాగిన ధోని-జాదవ్ జోడీ  బ్యాటింగ్ తనకెంతో విసుగు తెప్పించిందని మాస్టర్ బ్లాస్టన్ సచిన్ టెండూల్కర్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ధోని నుండి అలాంటి ఆటతీరును ఊహించలేకపోయానని తెలిపాడు.  అప్ఘాన్  బౌలింగ్ బాగుండొచ్చు...కానీ మరీ ఇంత పేలవంగా బ్యాటింగ్ సాగడం నిరాశ కలిగించిందన్నాడు. 

అయితే ఇదే ఇన్సింగ్స్ పై టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందిస్తూ సచిన్ వాదనతో విబేధించాడు. టీమిండియా టోటల్ తగ్గడానికి ధోని-జాదవ్ ఇన్నింగ్స్ మాత్రమే కారణం కాదన్నది తన అభిప్రాయమన్నాడు.  అయినా కేవలం ఒక్క మ్యాచ్ ప్రదర్శనతో ధోనిని విమర్శించడం తగదన్నాడు. ఈ మ్యాచ్ మినహాయిస్తే ఈ ఏడాది మొత్తం అతడు అద్భుతమైన రాణించాడని పేర్కొన్నాడు.  మంచి సత్తాగల ఆటగాడు ధోనీ అంటూ గంగూలీ పొగడటమే కాదు మద్దతుగా నిలిచాడు.  

అఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ధోని ఏకంగా 52 బంతులాడి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా ధోని  తన శైలికి  భిన్నంగా ఆడటం అభిమానులకే కాదు మాజీలు, విశ్లేషకులను కూడా నచ్చలేదు. దీంతో వారు ధోనిపై విమర్శలకు దిగగా గంగూలీ మాత్రం మద్దతు ప్రకటించాడు. ఈ  ఒక్క ఇన్నింగ్స్ ద్వారా అతడి సత్తాను అంచనావేయవద్దని అభామానులకు సూచించాడు.