ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత జట్టు అందుకు తగ్గట్లుగానే అదరగొట్టింది. లీగ్ దశలో ప్రత్యర్థులను మట్టికరిపించి  వరుస విజయాలను అందుకుంది. ఇలా భారత్ ను పాయింట్స్ పట్టికలో టాప్ లో నిలబెట్టడుతూ సెమీస్ కు చేర్చడంతో ఇద్దరు ఆటగాళ్ళు కృషి ప్రధానంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, బౌలింగ్ లో జస్ప్రీత్ సింగ్ బుమ్రా లు అదరగొట్టడం వల్లే భారత జట్టు సెమీస్ కు చేరిందనడంతో అతిశయోక్తి లేదు. ఈ  విషయంతో టీమిండియా మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఏకీభవించాడు.

ప్రపంచ కప్ లీగ్ దశలో భారత జట్టు ప్రదర్శనపై శ్రీకాంత్ మాట్లాడుతూ... ''  టీమిండియా వరుస విజయాలను అందుకోవడంలో బుమ్రా కీలకంగా వ్యవహరించాడు. భారత బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న అతడు మిగతా బౌలర్లకు ఆదర్శంగా నిలిచే ప్రదర్శన చేశాడు. కొత్త బంతితో మ్యాచ్ ఆరంభంలో, అవసరాన్ని బట్టి మిడిల్ ఓవర్లలో రాణించగల సత్తా  బుమ్రాలో వుంది. ఇక డెత్ ఓవర్లలో అతడి ప్రదర్శన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులు అతన్ని ''డెత్ ఓవర్ స్పెషలిస్ట్'' అని ముద్దుగా పిలుచుకోవడమే చివరి ఓవర్లలో అతడి బౌలింగ్  ఎంత గొప్పగా  సాగుతుందో తెలియజేస్తుంది. 

ఇక అతడి ఖచ్చితత్వంతో కూడిన యార్కర్లకు ఎంతటి గొప్ప బ్యాట్ మెన్ అయినా బోల్తా పడాల్సిందే. ముఖ్యంగా లీగ్ దశలో ఇంగ్లాండ్, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్ అతడు పదునైన యార్కర్లు బ్యాట్ మెన్స్ ని ఎంతలా ఇబ్బంది పెట్టాయో చూశాం. కాబట్టి సెమీఫైనల్, ఫైనల్లోనూ అతడి ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నాను.'' అని శ్రీకాంత్ వెల్లడించాడు.