ప్రపంచ కప్ 2019 లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు ఇంగ్లాండ్ ఓటమి రుచి చూపించింది. ఆతిథ్య జట్టు మొదట బ్యాటింగ్ లో రాణించి 337 పరుగులు చేసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది. దీంతో హేమాహేమీ బ్యాట్ మెన్స్ ను కలిగిన భారత జట్టు కూడా లక్ష్యఛేదనలో తడబడి కేవలం 306 పరుగులకే చేతులెత్తేసింది. చివరివరకు క్రీజులో ధోని, కేదార్ జాదవ్ లు వుండి కూడా వేగంగా పరుగులు సాధించలేక పోయారు. దీంతో 31 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలయ్యింది. 

ఇలా మరోసారి స్లో బ్యాటింగ్ కొనసాగించి జట్టు ఓటమికి కారణమైన వీరిద్దరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా అత్యుత్తమ ఫినిషర్ గా పేరున్న ధోని బ్యాటింగ్  మరోసారి నత్తనడకన సాగడం అభిమానులకే కాదు మైదానంలోని కామెంటేటర్స్ కు కూడా నచ్చలేదు. ఇలా కామెంటేటర్ గా వ్యవహరించిన టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ధోని ఇన్నింగ్స్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

డెత్ ఓవర్లలో ధోని, కేదార్ జాదవ్ లు స్లో  బ్యాటింగ్ కొనసాగడంతో సాధించాల్సిన రన్ రేట్ అంతకంతకు పెరిగింది. దీంతో గెలుపుపై ఆశలు వదులుకున్న అభిమానులు మ్యాచ్ ముగియక ముందే మైదానాన్ని వీడటం ఆరంభించారు. దీన్ని గమనించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ నాజర్ హుస్సెన్ ధోని మార్క్ షాట్లను చూడలేమని ఫిక్స్ అయిన అభిమానులు మైదానాన్ని  వీడుతున్నారు అని అన్నాడు. 

వెంటనే గంగూలీ మాట్లాడుతూ... తన పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే వుందన్నాడు. ఈ  ఆటతీరు గురించి చెప్పాలన్నా బాధతో తనకు మాటలు కూడా రావడం లేదన్నాడు. 300 పరుగుల లోపే జట్టు ఆలౌటయినా తనకు ఇంత బాధ అయ్యేది కాదేమో. కానీ బ్యాట్ మెన్స్ వుండి...అందులోనూ ధోని లాంటి ఫినిషర్ వుండి టీమిండియా ఓడిపోవడం బాధగా వుందన్నాడు. ఐదు వికెట్లు చేతిలో వుంచుకుని కూడా అటాకింగ్ గేమ్ ఆడలేకపోయిన వారి గురించి తాను  ఎక్కువగా మాట్లాడతల్చుకోలేదని  గంగూలీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.