ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ ద్వారా టీమిండియా స్టార్ బౌలర్  జస్ప్రీత్ సింగ్ బుమ్రా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంక తో జరుగుతున్నచివరి  లీగ్ మ్యాచ్ లో ఓపెనర్లిద్దరిని పెవిలియన్ కు పంపించడం ద్వారా అతడి ఖాతాలోకి వంద వికెట్లు చేరాయి. దీంతో వంద వికెట్ల క్లబ్ లో చేరిన 21వ టీమిండియా బౌలర్ గా బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు. 

బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అతికొద్ది రోజుల్లోనే టీమిండియా స్టార్ బౌలర్ గా ఎదిగాడు.  ఖచ్చితత్వంతో కూడిన యార్కర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించడం అతడి స్టైల్. అందువల్లే అభిమానులు అతన్ని యార్కర్ స్పెషలిస్ట్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

ఇలా అద్భుతమైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించిన బుమ్రా ప్రపంచకప్ ఆడే అరుదైన అవకాశాన్ని పొందాడు. ఇలా ఈ మెగా టోర్నీలో టీమిండియా  బౌలింగ్ విభాగానికి సారథ్యం  వహిస్తున్నఅతడు ప్రతి మ్యాచ్ లోనూ చెలరేగుతున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంకతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లోనే ఆరంభంలోనే అద్భుతం చేశాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక కు కోలుకోలేని దెబ్బతీశాడు. మొదట కెప్టెన్ కమ్ ఓపెనర్ కరుణరత్నే(10 పరుగులు) ను 17 పరుగుల వద్దే పెవిలియన్ కు పంపించాడు. ఈ  వికెట్ ద్వారా బుమ్రా  తన కెరీర్లో వందో వికెట్ పడగొట్టాడు. ఇలా వంద వికెట్లు పడగొట్టిన 21వ ఇండియన్ క్రికెటర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కూడా మరో ఓపెనర్ కుషాల్ పెరీరా(18 పరుగులు) ను  కూడా 40 పరుగుల వద్ద ఔట్ చేసి 101 వ వికెట్ కూడా పడగొట్టాడు.    

శ్రీలంకతో జరుగుతన్న మ్యాచ్ తో కలుపుకుని బుమ్రా ఇప్పటివరకు 57 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిద్యం వహించాడు. అందులో తొమ్మిది ప్రపంచ కప్ మ్యాచులున్నాయి. వీటన్నింటిలో కలిపి అతడు మొత్తం 101 వికెట్లు పడగొట్టాడు.