టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోని తన ఆటతోనే వ్యక్తిత్వంతోనూ పలుమార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అతడు క్రికెట్ ను ఎంతలా ప్రేమిస్తాడో తనకు నచ్చినవారిని కూడా అంతలా ప్రేమిస్తాడు. క్లిష్ట సమయాల్లో తనకు అండగా నిలిచిన వారిని అతడు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. తగిన సమయంలో వారి రుణాన్ని తీర్చుకుని కృతజ్ఞత చూపిస్తుంటాడు. అలా ఈ ప్రపంచ కప్ లోనూ తనకు వివిధ సందర్భాల్లో సహాయ సహకారాలు అందించినవారికి అడక్కుండానే సహాయం చేస్తూ ధోనీ మరోసారి మంచి మనసును చాటుకున్నాడు. 

ఈ ప్రపంచ కప్ లో ధోని బ్యాటింగ్ కు దిగినప్పుడల్లా వేరు వేరు కంపనీల స్టిక్కర్లతో కూడిన బ్యాట్స్ వాడుతున్నాడు. ఇప్పటివరకు అతడు ఎస్ఎస్, ఎస్‌జి, బాస్ పేర్లతో  కూడిన బ్యాట్ల ఉపయోగించాడు. ఇలా ధోని బ్యాట్లపై  స్టిక్కర్ల మార్పు వెనుక వున్న రహస్యాన్ని  తెలుసుకోడాని ప్రయత్నిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 

ధోని బ్యాట్స్ మార్చడానికి గల కారణాలను అతడి మేనేజర్ అరుణ్ పాండే  బయటపెట్టాడు.  '' ధోని ఈ ప్రపంచ కప్ ను వ్యాపార కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూస్తున్నాడు. అందుకోసమే కెరీర్లో ఆఖరి ప్రపంచ కప్ ఆడుతున్న అతడు గతంలో తనకు అండగా నిలిచినవారందరి  కోసం ఏదో చేయాలనుకున్నాడు. అందులో భాగమే అతడి బ్యాట్స్ పై కొత్త స్టిక్కర్లు.  

సహజంగా ధోని వంటి సీనియర్లు, మంచి మార్కెట్ వున్న ఆటగాళ్ల స్పాన్సర్ షిప్ కోసం కంపనీలు ఎగబడుతుంటాయి. కొన్ని కోట్ల మంది చూసే ప్రపంంచ కప్ వంటి మెగా టోర్నీలో  అయితే అలాంటివారికి మరింత క్రేజ్ వుంటుంది. ఎన్నికోట్లయినా ఇచ్చి వారితో ప్రచారం చేయించాలని చాలా మల్టీ నేషనల్ కంపనీలు భావిస్తుంటాయి. అలాంటి భారీ  ఆఫర్లను కాదని ధోని ఈ ప్రంపచ కప్ తనవారికోసం ఆడాలనుకున్నాడు.

మరీముఖ్యంగా అతడి కెరీర్ ఆరంభంలో కిట్‌లు అందించి అండగా నిలిచిన కంపెనీలకు అతను ఈ రకంగా ప్రచారం చేస్తున్నాడు. ఆయా కంపనీల స్టిక్కర్లతో కూడిన బ్యాట్లను ప్రస్తుతం ధోని ఉపయోగిస్తున్నాడు. ఇందుకోసం కనీసం  ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా  ప్రచారం నిర్వహిస్తూ కృతజ్ఞతను చాటుకుంటున్నాడు'' అని వివరించాడు.