బర్మింగ్ హామ్ వేదికగా టీమిండియా-బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ ఆడుతున్న భారత జట్టులో ఏకంగా నలుగురు వికెట్ కీపర్లు ఆడుతున్నారు. ఇలా ఓ జట్టు ఏకంగా నలుగురు వికెట్లను కలిగివుండటం చాలా అరుదు. అలాంటి వారంతా ఒకే  మ్యాచ్ లో బరిలోకి దిగడం ప్రపంచ కప్ లోనే కాదు వన్డే చరిత్రలోనూ చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే యాదృచ్చికంగానే అయినా టీమిండియా నలుగురరు వికెట్ కీపర్లతో ఆడుతూ చరిత్ర సృష్టించింది. 

టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్ లోనూ వికెట్ కీపర్ గా వ్యవహరించనున్నాడు. అయితే మిగతా వికెట్ కీపర్లంతా బ్యాట్ మెన్స్ కోటాలో జట్టులో చేరారు. దినేశ్ కార్తిక్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ముగ్గురూ వికెట్ కీపర్లే  అయినప్పటికి వివిధ సమీకరణల దృష్ట్యా జట్టులో చోటు దక్కించుకున్నారు.

ప్రపంచ కప్ ఆరంభం నుండి ధోనితో పాటు కేఎల్ రాహుల్ భారత జట్టులో వున్నాడు. అయితే శిఖర్ ధవన్ గాయంతో ఈ  టోర్నీ మొత్తానికి దూరమవడంతో మిడిల్ ఆర్డర్లో కాకుండా ఓపెనర్ గా బరిలోకి దిగుతున్నాడు. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్ విజయ్ శంకర్ కూడా గాయంతో జట్టుకు దూరమవడంతో రిషబ్ పంత్ కు అవకాశం వచ్చింది. ఇక ఈ ప్రపంచ  కప్ ఆరంభం నుండి పరుగులు సాధించడానికి ఇబ్బంది పడుతున్న కేదార్ జాదవ్ ను ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో దినేశ్ కార్తిక్  బరిలోకి దిగాడు. 

ఇలా వివిధ కారణాల వల్ల  నలుగురు వికెట్ కీపర్లు ఒకే మ్యాచ్ లో బరిలోకి దిగాల్సి వచ్చింది. అయితే వికెట్ కీపర్ గా మాత్రం ధోనినే వ్యవహరించనుండగా వీరంతా కేవలం బ్యాట్ మెన్ కోటాలోనే జట్టులోకి వచ్చారు. వీరిని  బ్యాట్ మెన్స్ గానే పరిగణించి  తుది జట్టులో చోటు కల్పించినట్లు  టీమిండియా మేనేజ్ మెంట్ వెల్లడించింది.