ప్రపంచ కప్ టోర్నీ నుండి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధావన్ సెంచరీ బాది టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించి తాను మాత్రం జట్టుకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్ లో చేతి బొటనవేలికి తీవ్ర గాయమవడంతో దాదాపు మూడు వారాల పాటు ప్రపంచ కప్ కు, భారత జట్టుకు దూరమవ్వాల్సి వచ్చింది. అయితే ఈ గాయం కారణంగా జట్టుకు దూరమవడం తనను బాధించడం లేదని....మళ్లీ ఎగిసే కెరటంలా మారి జట్టులో  చేరతానంటూ ఓ హిందీ కవిత్వాన్ని ఉదహరిస్తూ ధావన్ ఓ ట్వీట్ చేశాడు. 

ప్రముఖ హిందీ కవి రహత్ ఇండోరీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేలా రాసిన ఓ కవితను ధావన్ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ''  ఒక్కోసారి మనం రోజా పూవులోని  సుగంధ పరిమళం మాదిరిగా గాల్లో విహరించాలనుకుంటాం....ఒక్కోసారి పర్వాతాలపై నుండి హిమపాతంలా జాలువారాలనుకుంటాం. కొన్ని అవాంతరాలు మనల్ని అలా చేయకుండా ఆపుతాయి. కానీ మనల్ని అలా ఎగిరేలా చేస్తుంది రెక్కలు కాదు...మన ఆత్మవిశ్వామం  మాత్రమే.'' తన గాయానికి సంబంధించిన ఫోటోలను జతచేస్తూ ధావన్ ఈ కవితను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 

అయితే ధావన్ చేసిన ఈ ట్వీట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ధావన్ ను నిజంగా ఎవరూ అడ్డుకోలేరని... అతడి తిరిగి ఆత్మవిశ్వాసంతో  ప్రపంచ కప్ లో అడుగుపెడతాడని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ధావన్ ట్వీట్ కు కామెంట్ చేస్తున్నారు. 

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ధావన్‌ ఎడమ చేతి బొటనవేలికి తీవ్ర గాయమైంది. ఈ గాయంతోనే శతకం బాదిన అతడు ఆ తర్వాత పెవిలియన్ కే పరిమితమయ్యాడు. అతడి స్థానంలో జడేజా ఫీల్డింగ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం గాయమైన వేలికి స్కానింగ్‌ నిర్వహించగా ‘హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌’గా తేలింది. దీంతో అతడికి దాదాపు మూడు వారాల  పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఈ విధంగా ధావన్ ప్రపంచ కప్ కు దూరమయ్యాడు.