చిరకాల ప్రత్యర్థి పాక్ పై ఘన విజయాన్ని సాధించి ఆనందంలో వున్న టీమిండియా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించే క్రమంలో ఓపెనర్ శిఖర్ ధావన్ బొటనవేలికి గాయమైన విషయం తెలిసిందే. అందువల్ల అతడు కొన్ని  మ్యాచులకు దూరమవ్వాల్సి వచ్చింది. 

దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్ లో ఆకట్టుకోలేకపోయిన ధవన్ ఆస్ట్రేలియాపై మాత్రం చెలరేగాడు. పటిష్టమైన ఆసిస్ బౌలింగ్  లైనప్ పు సమర్థవంతంగా ఎదుర్కొంటూ కంగారెత్తించాడు. ఇలా అతడు కేవలం 109 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేశాడు. అయితే దాటిగా ఆడే క్రమంలో ఆసిస్ బౌలర్ విసిరిన  ఓ బంతి వేగంగా వచ్చి ధవన్ బొటనవేలికి తాకింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి ఫీల్డింగ్ చేయలేదు. 

అయితే ఈ  మ్యాచ్ అనంతరం ధవన్ ఎడమచేతి బొటనవేలుకి స్కానింగ్ చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.  ఈ క్రమంలోనే అతడు టీమిండియా తుది జట్టులో చోటు కోల్పోయాడు. కానీ అధికారికంగా ప్రపంచ కప్ కు దూరం కాలేదు. కానీ తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితి, ఫిట్ నెస్ ను పరీక్షించిన టీం మేనేజ్ మెంట్ సంతృప్తి చెందలేదు. దీంతో ప్రపంచ కప్ టోర్నీ  మొత్తానికి ధవన్ దూరం కానున్నట్లు ప్రకటించారు. 

ఇప్పటికే  ఇంగ్లాండ్ కు చేరుకున్న యువ ఆటగాడు రిషబ్ పంత్ అతడి స్థానంలో జట్టులో చేరనున్నాడు. ఇలా కెఎల్ రాహుల్ ఈ టోర్నీ మొత్తంలో టీమిండియా ఓపెనర్ గా కొనసాగనుండగా...మళ్లీ నాలుగో స్థానంలో సందిగ్దం నెలకొంది. పాక్ తో జరిగిన మ్యాచ్ విజయ్ శంకర్ ఈ స్థానంలో ఆడగా పంత్ రాకతో మరోసారి గందరగోళం నెలకొంది.