ప్రపంచ కప్ టోర్నీనుండి టీమిండియా నిష్క్రమించింది. ఎన్నో ఆశలతో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ సేన సెమీఫైనల్ నుండే వెనుదిరగాల్సి వచ్చింది. మాంచెస్టర్ వేదికన జరిగిన సెమీఫైనల్లో వర్షం కారణంగా పిచ్ బౌలర్లకు అనుకూలంగా  మారడంతో భారత్ ను న్యూజిలాండ్ ఓడించగలిగింది.  కివీస్ బౌలర్లధాటికి టీమిండియా టాప్ ఆర్డర్ చేతులెత్తేయడమే ఈ పరాజయానికి ముఖ్య కారణం. మరీముఖ్యంగా ఆరంభంలో ఓపెనర్లు రోహిత్, రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు కేవలం ఒక్కోపరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతోనే టీమిండియా ఓటమి దాదాపు ఖాయమయ్యింది. 

ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో అదరగొట్టిన రోహిత్ ఈ మ్యాచ్ లో మాత్రం పేలవంగా ఆడాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ఇలా అతడు బ్యాట్ తో రాణించలేకపోయినా క్రీడాస్పూర్తిని ప్రదర్శించడం అభిమానులను ఆకట్టుకుంది. భారత్ ఇన్నింగ్స్ ఓటమిదిశగా సాగుతుండగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (77 పరుగులు)  అద్భుతమైన హాఫ్ సెంచరీతో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఇలా అతడు బ్యాటింగ్ చేస్తున్నంతసేపూ రోహిత్ ఓ సాధారణ అభిమాని మాదిరిగా అతన్ని ఉత్సాహపరుస్తూ కనిపించాడు. 

న్యూజిలాండ్  బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జడేజా బ్యాటింగ్ చేస్తుండగా పోడియం నుండి రోహిత్ సైగలతోనే అతన్ని ఉత్సాహపరిచాడు. '' నువ్వు చాలా బలమైన ఆటగాడివి.  ఒంటిచేత్తో జట్టును గెలిపించగల సత్తా నీ సొంతం. కమాన్ జడ్డూ.... ఈ మ్యాచ్ ను గెలిపించు'' అంటూ రోహిత్ క్రీజులోని జడేజాకు దైర్యాన్ని నూరిపోశాడు. జడేజా బ్యాటింగ్ చేస్తూ సహచరులవైపు చూసిన ప్రతిసారి రోహిత్ అతడికి ఏదో ఒక సైగ చేస్తూ ఉత్సాహపర్చడం కనిపించింది. 

అయితే టీమిండియ గెలుపుకోసం రోహిత్ పడుతున్న తాపత్రయం అభిమానులను ఆకట్టుకుంది. అతడు పరుగులు సాధించకుండా నిరాశపర్చినా సహచచరుడికి అతడు ఉత్సాహపరుస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.