రోహిత్ శర్మ... ఎంత విద్వంసకర ఆటగాడో అందరికీ తెలసిందే. ఈ ప్రపంచ కప్ టోర్నీలో అయితే అతడు మరింతగా రెచ్చిపోతున్నాడు. ఇప్పటివరకు టీమిండియా తలపడ్డ మ్యాచుల్లో అతడు ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయితే ఇలా సెంచరీలు సాధించిన  ప్రతి మ్యాచ్ లోనూ రోహిత్ సింగిల్ డిజిట్ వద్దే ఔటయ్యేవాడు. కానీ ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ల తప్పిదాలతో లైఫ్ లభించగా అతడికి ఇక వెనుదిరిగి చూసే అవకాశం రాలేదు. ఇలా రోహిత్ ను ఔట్ చేసే అవకాశాన్ని ఒక్కసారి మిస్ చేసుకుంటే ఇక అతడి విశ్వరూపం చూడాల్సిందేనన్నమాట. 

ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లోనూ సేమ్ అలాగే జరిగింది.  బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్‌ వేసిన ఐదో ఓవర్లో రోహిత్ క్యాచ్ ను  తమీమ్ ఇక్బాల్ జారవిడిచాడు. ఆ సమయంలో రోహిత్ స్కోరు కేవలం 9 పరుగులు మాత్రమే. ఇలా సింగిల్ డిజిట్ వద్దే రోహిత్ ను ఔట్ చేసే అవకాశాన్ని కోల్పోయి బంగ్లా భారీ  మూల్యం చెల్లించుకుంది. అతడు ఈ లైఫ్ తర్వాత బంగ్లాకు మరో అవకాశం ఇవ్వకుండా సెంచరీ(92 బంతుల్లో 104 పరుగులు)తో అదరగొట్టాడు. 

ఈ ప్రపంచ కప్ లో రోహిత్ సెంచరీ సాధించిన ప్రతిసారి అతడికి ఓ లైఫ్ లభించింది. అది కూడా సింగిల్ డిజిట్ వద్ద ఔట్ చేసే అవకాశాన్ని ప్రత్యర్థులు కోల్పోయారు. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఆడిన మొదటి మ్యాచ్ లోనే రోహిత్ సెంచరీ(122 పరుగులు)తో ఆకట్టుకున్నాడు.ఆ  మ్యాచ్ దక్షిణాఫ్రికాకు కేవలం ఒక్క పరుగు వద్దే రోహిత్ ను ఔట్ చేసే అవకాశం వచ్చినా జారవిడుచుకుంది. దీంతో అతడు సెంచరీ చేయగలిగాడు. 

ఆ తర్వాత  ఆస్ట్రేలియా కూడా అదే తప్పు చేసింది. కేవలం 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ కు లైఫ్ లభించగా అతడు హాఫ్ సెంచరీ(57 పరుగులు) తో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో విజయం భారత్ నే వరించింది. 

ఇక ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో  టీమిండియా ఓటమిపాలైనా సెంటిమెంట్ మాత్రం కొనసాగింది. ఈ మ్యాచ్ లో కూడా రోహిత్ ను 4 పరుగుల వద్దే పెవిలియన్ కు పంపించే అవకాశాన్ని ఇంగ్లీష్ జట్టు వదులుకుంది. దీంతో అతడు మరో సెంచరీ(102 పరుగులు) తో చెలరేగాడు. ఇలా రోహిత్ ప్రతి మ్యాచ్ లోనూ ప్రత్యర్థులకు కేవలం ఒకే ఒక అవకాశమిచ్చాడు. ఆ తర్వాత చేలరేగి మరో అవకాశం ఇవ్వకుండా సెంచరీతో చేలరేగాడు.