ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అప్ఘాన్ తో మ్యాచ్ లో మాత్రం విఫలమయ్యాడు. అతడు ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అప్ఘాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ ఓ అద్భుతమైన బంతితో రోహిత్ ను బోల్తాకొట్టించి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా కేవలం 7 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది. 

అయితే రోహిత్ ను ఔట్ చేయడానికి అప్ఘాన్ అతడి బలానే అస్త్రంగా మలుచుకుంది. స్పిన్ బౌలింగ్ ను సమర్ధవంతగా ఎదుర్కునే రోహిత్ ను అదే స్పిన్ బౌలర్లను ఉపయోగించి దెబ్బతీయాలని ఆ జట్టు వ్యూహరచన చేసినట్లుంది. అందుకోసమే మొదటి ఓవరే స్పిన్ బౌలర్ తో వేయించి అప్ఘాన్ కెప్టెన్ నయిబ్ సాహసం చేశాడు. అయితే వారి వ్యూహం మొదటి ఓవర్లోనే కాకున్నా ఐదో ఓవర్లో ఫలించింది.

 ఏ బ్యాట్ మెన్ అయినా మొదట నెమ్మదిగా ఆడుతూ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే రోహిత్ కూడా కుదురుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి అతన్ని స్పిన్ బౌలింగ్ తో ఊరించాలని అప్ఘాన్ భావించింది. ఇలా స్పిన్నర్లను బాదడానికైనా అతడు పరుగుల వేగాన్ని పెంచుతాడు కాబట్టి ఏదో ఒకదగ్గర అతడు దొరక్కపోతాడా అని అప్ఘాన్ భావించింది. 

చివరకు అప్ఘాన్ వ్యూహం ఫలించి రోహిత్ స్పిన్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. మొత్తం 10 బంతులాడిన అతడు ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. ముజీబ్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతిని రోహిత్‌ అంచనావేయలేకపోయాడు. దీంతో అది రోహిత్ బ్యాట్ నుండి తప్పించుకుని  వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో అతడు క్లీన్‌ బౌల్డ్‌ అయి పెవిలియన్ బాట పట్టాడు.