ప్రపంచ కప్ టోర్నీలో వరుస సెంచరీలతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఫార్మాట్ లో ఈ ఏడాది ఆరంభంనుండి అద్భుతంగా రాణిస్తున్న రోహిత్ ప్రపంచ కప్ టోర్నీలో తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఇలా అతడు పరుగుల వేటలో దూసుకుపోతూ ఈ ఏడాది వేగంగా వెయ్యి  పరుగులు పూర్తిచేసుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ కంటే ముందే రోహిత్ ఈ ఘనత సాధించాడు.

అయితే ఈ ఫీట్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అత్యంత చేరువలో వున్నాడు. అతడు మరో 31 పరుగులు చేస్తే ఈ ఏడాది వెయ్యి పరుగులను పూర్తిచేసుకోనున్నాడు. అతడు  కూడా ఈ మ్యాచ్ లోనే ఆ ఘనత సాధించే అవకాశాలున్నాయి. 

 ఈ మ్యాచ్ కు ముందు వెయ్యి పరుగుల మైలురాయికి రోహిత్ కేవలం 4 పరుగుల దూరంలో నిలిచాడు. బంగ్లా కెప్టెన్ మోర్తజా వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికే సిక్స్ బాదిన అతడు సునాయాసంగా లాంఛనాన్ని పూర్తిచేశాడు. ఈ సిక్స్ తోనే రోహిత్ తన పరుగుల ఖాతా తెరవడంతో పాటు వెయ్యి పరుగులను పూర్తి చేసుకోవడం విశేషం. 

ఇక ఇప్పటికే మూడు సెంచరీలు సాధించిన రోహిత్ బంగ్లాపై కూడా మంచి ఊపుతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే కేవలం 45 బంతుల్లో అర్థ శతకాన్ని పూర్తిచేసుకున్న అతడు సెంచరీ దిశగా సాగుతున్నాడు. అతడికి తోడుగా  మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీతో అదరగొడుతున్నాడు. ఓపెనర్లిద్దరు చెలరేగుతుండటంతో టీమిండియా ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.