ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ పై విజయాన్ని సాధించి టీమిండియా సెమీఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే. అయితే 315 పరుగులను కూడా కాపాడుకోవడంలో భారత జట్టు చాలా కష్టపడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ 48 ఓవర్లలో 286 పరుగులు చేసి ఆలౌటవడంతో టీమిండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే భారత జట్టు విజయాన్ని సాధించినప్పటికి ఈ మ్యాచ్ ద్వారా జట్టులో కొన్ని లోపాలు బయటపడినట్లు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పేర్కొన్నాడు. మరీ  ముఖ్యంగా యువ ఆటగాడు రిషబ్ పంత్ ఫీల్డిగ్ విషయంలో ఆయన అసహనం  వ్యక్తం చేశాడు.  

'' ప్రపంచ కప్ టోర్నీలో ఇటీవలే ఆరంగేట్రం చేసిన రిషబ్ పంత్ బ్యాటింగ్ బాగానే వుంది. కానీ అతడి ఫీల్డింగ్ లో మాత్రం కొన్ని  లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా పంత్ బంతిని త్రో చేసే విధానం...ఔట్ పీల్ట్ లో కదిలికలను మార్చుకోవాల్సిన అవసరం వుంది. అతడడు మైదానంలో అంత చురుగ్గా కదల్లేకోయాడు. కాబట్టి రిషబ్ పంత్ ను ఫీల్డింగ్ లో మరింత రాటుదేల్చేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటాము. 

నాతో పాటు కెప్టెన్ కోహ్లీ, ధోనిలు కూడా పంత్ ఫీల్డింగ్ పై ఇదే అభిప్రాయంతో  వున్నారు. కాబట్టి అతడు మరింత మెరుగైన  ఫీల్డింగ్ చేయగలిగితే కీలక స్థానంలో అతన్ని ఫీల్డింగ్ చేయించాలని వారు భావిస్తున్నారు. బంగ్లాతో మ్యాచ్ లో అతడు ఓ క్యాచ్ అందుకోవడంతో పాటు దాదాపు ఐదు పరుగులు సేవ్ చేశాడు. కానీ ఇది చాలదు.

పంత్ కంటే దినేశ్ కార్తిక్ కాస్త మెరుగ్గా  ఫీల్డింగ్ చేశాడు. మైదానంలో వేగంగా కదులుతూ...తనవైపు వచ్చిన బంతులను చక్కగా అడ్డుకున్నాడు. అంతేకాకుండా అతడి బంతిని  త్రో చేసే విధానం  కూడా బావుంది.'' అని శ్రీధర్ వెల్లడించాడు.