ఇంగ్లాండ్ లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన విషయం  తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే వరుసగా  సౌతాఫ్రికా,  ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఓడిస్తూ భారత ఆటగాళ్లు  సత్తా చాటారు. అయితే ఇటీవల పసికూన అప్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు సునాయాసంగా గెలుస్తుందనుకుంటే చెమటోడ్చి గెలిచింది. మరీ  ముఖ్యంగా భారత బ్యాటింగ్ విభాగం అప్ఘాన్ బౌలర్ల దాటికి విలవిల్లాడిపోయి కేవలం 224 పరుగులకే చేతులెత్తేసింది. ప్రతిష్టాత్మక టోర్నీలో భారత బ్యాట్ మెన్స్ ఇలా పసికూనల బౌలింగ్ లో విఫలమవడంపై మాజీ టీమిండియా సారథి కృస్ణమాచారి శ్రీకాంత్ అసహనం  వ్యక్తం చేశారు. 

''అప్ఘానిస్తాన్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ 224 పరుగులకే భారత్ ను కట్టడిచేసేంతలా మాత్రం కాదు. భారత బ్యాట్ మెన్స్ వైఫల్యం వల్లే ఇంత  తక్కువ  పరుగలకు పరిమితమవ్వాల్సి వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకోడానికే  అప్ఘాన్ బౌలింగ్ అమోఘమంటున్నారు. కానీ  నాకు అలా ఏమాత్రం కనిపించలేదు...మన బ్యాటింగ్ బలహీనతే కనిపించింది. 

ముఖ్యంగా మిడిల్  ఓవర్లలో టీమిండియా బ్యాటింగ్ చెత్తగా సాగింది. అందువల్లే ఇంత తక్కువ స్కోరుకు పరిమతమవ్వాల్సి వచ్చింది. అయితే బ్యాటింగ్ విషయాన్ని వదిలేస్తే భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.  ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీ సరైన సమయంలో  సరైన బౌలర్ ను ఉపయోగించాడు. అందువల్లే కీలక సమయాల్లో అప్ఘాన్ వికెట్లు చేజార్చకుంది. దీంతో భారత్  కు విజయం వరించింది. '' అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.