ఇంగ్లాండ్ గడ్డపై  ప్రపంచ కప్ ట్రోఫీయే లక్ష్యంగా అడుగుపెట్టిన టీమిండియా ఆశలు ఒక్క మ్యాచ్ తో ఆవిరయ్యాయి. వరుస విజయాలను అందుకుని లీగ్ దశను విజయవంతంగా ముగించిన భారత్ సెమీఫైనల్ గండాన్ని మాత్రం దాటలేకపోయింది. న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఓటమిపాలై టోర్నీ నుండే నిష్క్రమించాల్సి వచ్చింది. 

అయితే హాట్ ఫేవరెట్ గా ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టిన జట్టు అర్థాంతరంగా వెనుదిరగడంపై బిసిసిఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్) బాగా సీరియస్ గా వున్నట్లు సమాచారం. సెమీఫైనల్లో ఓటమికి గల కారణాలను గుర్తించిన అధికారులు వాటిపై చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు మేనేజ్ మెంట్ ను వివరణ కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే  కమిటీ ఆప్ అడ్మినిస్ట్రేటర్స్(సీవోఏ) వీరిని  మూడు తప్పిదాలపై వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది. 

ప్రపంచ కప్ జట్టును ప్రకటించే సమయంలోనే రిషబ్ పంత్, అంబటి రాయుడు లను స్టాండ్ బై ఆటగాళ్ళుగా సెలెక్టర్లు ప్రకటించారు. అంటే భారత  జట్టులో ఎంపికచేసిన 15మంది  ఆటగాళ్లలో ఎవరైనా గాయపడినా, ఏదైనా కారణాలతో తప్పుకున్నా వీరికి అవకాశమిస్తారన్నమాట. అయితే ఓపెనర్ శిఖర్ ధవన్ గాయపడితే రిషబ్ పంత్ కు అవకాశమిచ్చారు.అంతవరకు బాగానే వున్నా ఆ తర్వాత విజయ్  శంకర్ గాయపడితే అంబటి రాయుడిని కాకుండా మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. ఇలా రాయుడిని  ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో బిసిసిఐ వివరణ కోరనుంది. 

ఇక న్యూజిలాండ్ తో జరిగిన కీలక సెమీఫైనల్ మ్యాచ్ లో ధోని ఆలస్యంగా బరిలోకి దిగాడు. దీంతో అతడు ఇంకాస్త ముందు బరిలోకి దిగివుంటే మరిన్ని పరుగులు సాధించేవాడని...పూర్తిగా చివర్లో బ్యాటింగ్ కు దిగడం వల్ల ఒత్తిడితో స్వేచ్చగా షాట్లు ఆడలేకపోయాడని అభిమానులే కాదు క్రికెట్ పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు. దీనిపై కూడా బిసిసిఐ ప్రశ్నించనున్నట్లు సమాచారం.

ఇక చివరగా జట్టు కూర్పుపై కూడా వివరణ కోరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏకంగా నలుగురు వికెట్ కీఫర్లను ఎందుకు ఆడించాల్సి వచ్చిందని అడగనుంది. అయితే ధోని కాకుండా మిగతావారిని వికెట్ కీపర్లుగా  కాకుండా స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్స్ గానే అవకాశమిచ్చామని ఇదివరకే టీం  మేనేజ్ మెంట్  ప్రకటించినా ఈ సమాధానంపై సీవోఏ సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. అతి త్వరలో స్వదేశానికి భారత ఆటగాళ్లు చేరుకోనున్నారు. కాబట్టి వారితో సమావేశమై వీటిపై వివరణ కోరాలని బిసిసిఐ భావిస్తోందని తెలుస్తోంది.