ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో అదరగొట్టడం ద్వారా సెమీఫైనల్ కు చేరింది. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచులన్నీ ఒకెత్తయితే ఇప్పటినుండి  జరిగే  రెండు మ్యాచులు మరోఎత్తు. సెమీ ఫైనల్, ఫైనల్ పోరులో ఏమాత్రం తడబడినా మరో ఛాయిస్ వుండదు. నేరుగా ఇంటిదారి పట్టాల్సి వుంటుంది. ఇలాంటి కీలక మ్యాచుల కోసం తాము మరింత పకడ్బందీగా సన్నద్దమవుతున్నట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ వెల్లడించాడు.

రేపు(మంగళవారం) మాంచెస్టర్ వేదికన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కోహ్లీ ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. కివీస్ ను బలమైన జట్టు అంటూనే ఆ జట్టును  ఎదుర్కొనే పూర్తి సామర్థ్యం టీమిండియా వద్ద వుందన్నాడు. ముఖ్యంగా బౌలింగే ప్రధాన బలంగా కలిగిన న్యూజిలాండ్ ను సమర్థవంతంగా ఎదుర్కోడానికి భారత బ్యాటింగ్ విభాగం సిద్దంగా వుందని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. 

అయితే గతంలో మాదిరిగానే ఈ మ్యాచ్ లోనూ టాస్ కీలకం కానుందన్నాడు. టాస్ గెలిచిన జట్టు అప్పటి పరిస్థితులు, పిచ్ ను దృష్టిలో వుంచుకుని నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి కాస్త లాభపడే అవకాశముంటుంది. అయితే టాస్ గెలిచిన జట్టే మ్యాచ్ గెలుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేమని కోహ్లీ పేర్కొన్నాడు. 

ఇక లీగ్ దశలో వరుస విజయాలు సాధించి పాయింట్ టేబుల్ లో టాప్ కు చేరడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత  పెంచిందన్నాడు. ఇలా ఎలాంటి అడ్డంకులు లేకుండా సునాయాసంగా  సెమీస్ కు చేరడంతో ఆటగాళ్లంతా కాస్త ప్రశాంతంగా వున్నారు. ఇప్పుడు ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి లేదు కాబట్టి సెమీస్ లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటారని నమ్మకంతో వున్నట్లు కోహ్లీ తెలిపాడు. 

ఇక ఈ టోర్నీ మొత్తంలో ఓపెనర్ రోహిత్ శర్మ ఆటతీరు అద్భుతంగా వుందని...ఇదే సెమీఫైనల్లో కొనసాగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అతడు టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో  నిలవడం  ఆనందంగా వుందన్నాడు. తన విషయానికి  వస్తే వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కోహ్లీ పేర్కొన్నాడు.