టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న  ప్రపంచ కప్ టోర్నీలో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఇలా లీగ్ దశలో అత్యధిక విజయాలతో టాప్ లో నిలిచిన కోహ్లీ సేన మూడోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. రేపు(మంగళవారం) మాంచెస్టర్ వేదికన జరగనున్న మొదటి సెమీఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 

ఈ సందర్భంగా భారత బౌలింగ్ విభాగంపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తాము ఇక్కడివరకు చేరుకోడానికి బ్యాటింగ్ విభాగం పాత్ర ఎంతుందో అంతకంటే ఎక్కువ బౌలింగ్ విభాగంది వుందన్నారు. ముఖ్యంగా ప్రధాన బౌలర్లు ఐదుగురు(  బుమ్రా, షమీ, భువనేశ్వర్, కుల్దీప్, చాహల్) చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారని కొనియాడాడు. వారికి తోడు హార్దిక్, జడేజాలు కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ప్రధాన బౌలర్లకు సహకారం అందిస్తున్నారని కోహ్లీ పేర్కొన్నాడు. 

ఈ క్రమంలో కోహ్లీ తనలో కూడా ఓ అద్భుతమైన బౌలర్ దాగున్నాడంటూ కాస్సేపు నవ్వులు పూయించాడు. అయితే తనలాంటి బౌలర్ ను టీమిండియా  ఉపయోగించుకోవడం లేదని... అయినా ఈ ప్రపంచ కప్ ఇప్పటివరకు ఆ అవసరం రాలేదన్నాడు. అవసరమైతే ఎలాంటి సమయంలో అయినా తాను బౌలర్ అవతారమెత్తడానికి సిద్దమేనంటూ కోహ్లీ ఓ ప్రశ్నకు ఫన్నీగా సమాధానమిచ్చాడు.