రేపు(ఆదివారం) ప్రపంచ కప్ టోర్నీలోనే  అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ వేదికగా భారత్-పాకిస్థాన్ ల మధ్య జరగనున్న ఈ బిగ్ ఫైట్ కోసం గతకొంతకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఈ దాయాది దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణ ప్రభావం ఈ మ్యాచ్ పై కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో శతృదేశానికి చెందిన జట్టును ఓడించి దేశ ప్రతిష్టను కాపాడుకోవాలని ఇరు దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో ఇండో పాక్ ల మధ్య స్నేహపూర్వకంగా సాగాల్సిన ఈ మ్యాచ్ కాస్తా ఉత్కంఠకు దారితీసింది.  

ఈ మ్యాచ్ నేపథ్యంలో అభిమానులు నియంత్రణ కోల్పోయే అవకాశం వుంది. గతంలో  ఓటమిపాలైన జట్టులోని ఆటగాళ్ళ ఇళ్లపై దాడులు చేయడం, వారి దిష్టి బొమ్మలు దహనం చేసిన సంఘటనలు చూశాం. అలాంటి  ఘటనలను దృష్టిలో పెట్టుకుని టీమిండియా కెప్టెన్ కోహ్లీ అభిమానులకు ఓ సూచన చేశాడు. ఈ మ్యాచ్ ను కేవలం రెండు జట్ల మధ్య జరిగే ఆటగానే చూడాలని అభిమానులనుద్దేశించి ఓ ప్రకటన చేశాడు. 

క్రికెట్ అనేది వినోదానికి సంబంధించిన  క్రీడ మాత్రమేనని...ఈ  మ్యాచ్ ను కూడా అలాగే సరదాగా చూసి ఆనందించాలని సూచించాడు. ఈ విషయాన్ని ఇరు దేశాల అభిమానులు కూడా గుర్తుంచుకోవాలన్నాడు. ఆటలో ఓ జట్టు ఓటమి...మరో జట్టు గెలుపు సహజమేనన్నాడు. ఫలితమేదైనా తాము(ఆటగాళ్లం) స్పోర్టివ్ గానే తీసుకుంటాం....మీరు(అభిమానులు) అలాగే తీసుకోవాలంటూ కోహ్లీ అభిమానులకు సూచించాడు. 

ఇండో పాక్ మ్యాచ్ తామేమీ స్పెషల్ గా భావించడం లేదని...అన్ని మ్యాచుల మాదిరిగానే చూస్తున్నామన్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని... ఈ మ్యాచ్ లోనూ అలాగే చేస్తున్నామని పేర్కొన్నాడు. బయటి వాతావరణాన్ని చూసి ఆటగాళ్ళలో కాస్త ఉద్వేగం  మాత్రం పెరిగిందని కోహ్లీ వెల్లడించాడు.