ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు షాకిచ్చింది. ఆదివారం బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ పై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించిన అద్భుత విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఓపెనర్ బెయిర్ స్టో(111 పరుగులు) భారత బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొని సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ 338 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు వుంచగలిగింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 306 పరుగులకే చేతులెత్తేసింది. ఇలా భారత జట్టు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో విఫలమై ఓటమిని చవిచూసింది. 

అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ ఓటమికి తమ వైఫల్యం కారణం కాదంటున్నాడు. తమ ఆటతీరు కంటే మరో అంశం ఈ మ్యాచ్ ను ఎక్కువగా ప్రభావితం చేసినట్లు తెలిపాడు. అదే షార్ట్ బౌండరీ. 

 '' బర్మింగ్ హామ్ లో ఎడ్జ్ బాస్టన్ మైదానం ప్రపంచ కప్ కోసం ఆతిథ్యమిస్తున్న అన్ని మైదాన్నాల్లోకెల్ల అతి చిన్నది. అలాగే ఈ మైదానంలోని వున్నట్లుగా ప్లాట్ పిచ్ మరెక్కడా లేదు. ఈ రెండింటి  వల్లే తాము ఓటమిని చవిచూడాల్సి  వచ్చింది '' అని కోహ్లీ పేర్కొన్నాడు. 

అవి టీమిండియా ఓటమిని ఎలా ప్రభావితం చేశాయో కూడా వివరించాడు. ఈ షార్ట్ బౌండరీ  కారణంగా తమకంటే ఇంగ్లాండ్ జట్టు ఎక్కువగా లాభపడిందని కోహ్లీ తెలిపాడు. '' ముఖ్యంగా బెయిర్ స్టో సెంచరీ సాధించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడింది.  ఈ  మైదానంలో  ఓ వైపు బౌండరీ  కేవలం 59 మీటర్లుండగా మరోవైపు ఏకంగా 82 మీటర్లుంది. ఈ విషయాన్ని గమనించిన బెయిర్ స్టో షార్ట్ బౌండరీవైపే ఎక్కువగా షాట్లు ఆడుతూ ఎక్కువ పరుగులు రాబట్టాడు. ఈ దిశగానే అతడు ఐదు ఫోర్లు, ఆరు సిక్సులు బాదాడు'' అని తెలిపాడు.

ఇక ఇంగ్లాండ్ బౌలర్లకు కూడా ఈ బౌండరీ వ్యత్యాసంపై అవగాహన వుందని పేర్కొన్నాడు. అందువల్లే దాన్ని దృష్టిలో వుంచుకునే వారి ఫీల్డ్ సెట్టింగ్, బౌలింగ్ సాగిందన్నాడు. తమ ఎదుట 338 పరుగుల భారీ లక్ష్యం, సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా వుండటంతో ఒత్తిడికి లోనయ్యామని పేర్కొన్నాడు. అందువల్లే లక్ష్యఛేదనలో తడబడి ఓడిపోవాల్సి వచ్చిందని కోహ్లీ వెల్లడించాడు.