ప్రస్తుతం మాంచెస్టర్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ మొదటి సెమీఫైనల్లో టీమిండియా తో న్యూజిలాండ్ తలపడుతోంది. ఈ మెగా టోర్నీలో మొదటి  ఫైనలిస్ట్ ను నిర్ణయించే ఈ కీలక మ్యాచ్ లో టీమిండియా కూర్పు చాలా విచిత్రంగా కనిపిస్తోంది. ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో భారత అభిమానులకు ఈ మ్యాచ్ ద్వారా ఓ అద్భుతాన్ని చూడాల్సిన అవకాశం వుండొచ్చని అర్థమవుతోంది. అదే కెప్టెన్ కోహ్లీ బౌలింగ్. 

కివీస్ తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో రెగ్యులర్ బౌలర్లు జస్ప్రీత్ సింగ్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యజువేందర్ చాహల్ లు ఆడుతున్నారు. ఇక ఆల్ రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు కూడా బౌలింగ్ చేయగలరు. అయితే ఈ తరుణంలో బౌలర్లకు గాయాలైనా, అనుకోని సంఘటనలతో మ్యాచ్ మధ్యలో వారు మైదానాన్ని వీడాల్సి వచ్చినా భారత జట్టుకు ఇబ్బంది తప్పదు. అంతేకాకుండా బౌలింగ్ లో వేరియేషన్ కోరుకున్నా కోహ్లీ వద్ద వున్న ఒకే ఒక్క ఆప్షన్ తాను బౌలింగ్ చేయడమే. 

నిన్న(సోమవారం) ప్రెస్ మీట్ సందర్భంగా కోహ్లీ తనలో కూడా ఓ అత్యుత్తమ బౌలర్ దాగున్నాడని సరదాగా అన్న  విషయం తెలిసిందే. అయితే ఇలా అతడు సరదాగా అనలేడని...సెమీ ఫైనల్లో బౌలింగ్ చేయనున్నట్లు ముందస్తుగానే అభిమానులకు తెలియజేసినట్లు ఇప్పుడు అర్థమవుతోంది. అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీ సెమీఫైనల్లో కూడా అప్పటి టీమిండియా కెప్టెన్ కోహ్లీ  బౌలింగ్ లోనే కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఔటయ్యాడు. అదే జోరు ఈ సెమీఫైనల్లోనూ కొనసాగించాలని కోహ్లీ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే అతడికి బౌలింగ్ చేసే అవసరం, అవకాశం వస్తుందో... రాదో చూడాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే మరి.