టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్ తో జరుగుతున్న మ్యాచ్ లో  అతడు మరో అర్థశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ఈ క్రమంలో 37 పరుగుల వద్ద వుండగా అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 

భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లు మాత్రమే ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులు సాధించారు. వారిద్దరి తర్వాత ఆ ఘనత సాధించిన భారత ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. సచిన్ 782 ఇన్నింగ్సుల్లో 34,357, ద్రవిడ్ 605 ఇన్నింగ్సుల్లో 24,208 పరుగులను  పూర్తిచేసుకోగా  కోహ్లీ 417 ఇన్నింగ్సుల్లో 20వేల పరుగులను పూర్తిచేసుకున్నాడు. 

ఇప్పటికే ఈ వరల్డ్ కప్ టోర్నీ ద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయిని  అందుకున్న ఆటగాడికి కోహ్లీ రికార్డు సృష్టించాడు. తాజాగా  అంతర్జాతీయంగా టెస్ట్‌, వన్డే, టీ20 అన్ని ఫార్మాట్లలో కలిపి 20వేల పరుగులు పూర్తి చేసుకున్నఆటగాడిగా రికార్డులకెక్కాడు.  అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 12వ క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు.  కేవలం భారత్  తరపున ఈ ఘనత  సాధించిన మూడో క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.   

అంతర్జాతీయంగా 20వేల పరుగులు సాధించడానికి సచిన్‌, లారాలకు 453 ఇన్నింగ్స్‌లు , రికీ పాంటింగ్‌కు 468 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. కానీ కోహ్లీకి కేవలం 417 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.