విరాట్  కోహ్లీ... భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. అభిమానులు ''రన్ మిషన్'' అని ముద్దుగా పిలుచుకోడాన్ని బట్టే అతడి స్పెషాలిటీ ఏంటో అర్థమవుతుంది. రోజురోజుకు అతడి పరుగుల దాహం పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు. ఇప్పటికే కోహ్లీ బ్యాట్ నుండి జాలువారిని పరుగుల వరదలో ఎందరో దిగ్గజాల రికార్డులు కొట్టుకుపోయాయి. తాజాగా ఈ వరల్డ్ కప్ మరికొన్ని రికార్డులపై కోహ్లీ కన్నేసాడు.

ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ(గురువారం) న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచ్ లో కోహ్లీ రాణిస్తే అరుదైన ఘనత సాధించనున్నాడు. వన్డేల్లో ఇటీవలే 10వేల పరుగులను పూర్తి చేసుకున్న అతడు అతి తక్కువ మ్యాచుల్లోనే 11 వేల పరుగులకు చేరువయ్యాడు. ప్రస్తుతం 221  ఇన్నింగ్సుల్లో 10,943 పరుగులను పూర్తిచేసుకున్న కోహ్లీ కివీస్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ(57 పరుగులు) చేస్తే సచిన్ పేరిట వున్న రికార్డు బద్దలవనుంది. 

వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 11వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారతీయ ఆటగాడిగా సచిన్ నిలిచాడు. అయితే అతడు ఈ  ఘనత సాధించడానికి మొత్తం 276 ఇన్నింగ్సులు ఆడాల్సి వచ్చింది. కానీ కోహ్లీ కేవలం న్యూజిలాండ్ మ్యాచ్ ద్వారా ఆ రికార్డును బద్దలుగొట్టే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ లో కాకున్న తర్వాతి మ్యాచ్ లో అయినా సచిన్ రికార్డు కోహ్లీ ఖాతాలోకి చేరడం ఖాయం. 

అంతేకాకుండా వన్డేల్లో 11వేల పరుగుల మైలురాయిని సాధించిన మూడో భారత క్రికెటర్ గా, అంతర్జాతీయ స్థాయిలో తొమ్మిదో క్రికెటర్ గా కోహ్లీ నిలవనున్నాడు. భారత్ నుండి ఇప్పటివరకు సచిన్, గంగూలీ మాత్రమే వన్డేల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీ వారి సరసన చేరనున్నాడు. 

ఇక మరో రికార్డుకు కూడా కోహ్లీ చేరువలో వున్నాడు. అతడు ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధిస్తే పై రికార్డులు బద్దలవనుండగా...సెంచరీ సాధిస్తే మరో అరుదైన ఘనతను అందుకోనున్నాడు. విండీస్ పై ఇప్పటివరకు అత్యధిక సెంచరీలు బాదిన  క్రికెటర్లుగా సెహ్వాగ, రికీ పాంటింగ్ లు నిలిచారు. వీరు మొత్తం ఆరు సెంచరీలను కివీస్ పై సాధించగా కోహ్లీ ఇప్పటివరకు ఐదు సెంచరీలను  బాదాడు. ఈ  మ్యాచ్ లో అతడు సెంచరీ చేస్తే ఆరు సెంచరీలతో వారిద్దరి సరసన చేరనున్నాడు.