ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా అప్ఘాన్ తో మ్యాచ్ లో తడబడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన అప్ఘాన్ దాదాపు టీమిండియాను ఓడించినంత  పనిచేసింది. అయితే లక్ష్యఛేదనకు మరో 12 పరుగుల దూరంలో వున్నపుడు టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ తన బౌలింగ్ మాయాజాలంతో అప్ఘాన్ పనిపట్టాడు. వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ ప్రదర్శనలో ఆకట్టుకోవడంతో పాటు అప్ఘాన్ ను ఆలౌట్ చేశాడు. దీంతో భారత్ 11 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 

ఇలా 32ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలర్ గా షమీ చరిత్ర సృష్టించాడు. ఇలా  అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో అరుదైన ఘనత సాధించిన షమీ ఈ క్రెడిత్ మొత్తం నా ఒక్కడిదే కాదంటూ వ్యాఖ్యానించాడు. ఈ రికార్డు సాధించడానికి తన వెనుక ఓ మాస్టర్ మైండ్ పనిచేసిందని షమీ  వెల్లడించాడు. 

'' చివరి ఓవర్లో మొదటి బంతికే ఫోర్ కొట్టి హఫ్ సెంచరీ(52 పరుగులు) పూర్తి చేసుకున్న మూడో బంతికే ఔట్ చేశాను. ఆ తర్వాత బంతికే  అఫ్తాబ్ ఆలం ను క్లీన్ బౌల్డ్ చేశా. దీంతో తర్వాతి బంతికి  మరో వికెట్ తీస్తే హ్యాట్రిక్ సాధించవచ్చు. ఈ సమయంలో ధోని భాయ్ నా వద్దకు వచ్చి తర్వాతి బంతి  యార్కర్ వేయమని సూచించాడు. దీంతో నేను అలాగే యార్కర్ బంతిని  వేసి రహ్మాన్ ను కూడా క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ సాధించాను. '' అంటూ తన బౌలింగ్ ప్రదర్శనలో ధోని పాత్ర కూడా వుందని షమీ వెల్లడించాడు.