ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ హవా కొనసాగుతోంది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ గాయపడి జట్టుకు దూరమవడంతో షమీకి కలిసొచ్చింది. అప్పటివరకు కేవలం డ్రెస్సింగ్ రూంకే పరిమితమైన అతడికి అప్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా బరిలోకి  దిగే అవకాశం వచ్చింది. ఈ  అవకాశాన్ని సద్వానియోగం చేసుకున్న అతడు  హ్యాట్రిక్ ప్రదర్శనతో అరుదైన ఘనత సాధించడమే కాకుండా జట్టును గెలిపించాడు. అయితే  అతడి హవా కేవలం ఈ ఒక్క మ్యాచ్ కే కాకుండా వరుసగా మూడు మ్యాచుల్లో కొనసాగింది. 

అప్ఘాన్ తో మ్యాచ్ తర్వాత వెస్టిండిస్ పై కూడా షమీ హవా కొనసాగింది.ఈ మ్యాచ్ లో అతడు నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ విజృంభించిన షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇలా వరుసగా మూడు మ్యాచుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన షమీ ఖాతాలో కొన్ని ప్రపంచ కప్ రికార్డులు వచ్చి చేరాయి. 

ఇలా ప్రపంచకప్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో నాలుగేసి వికెట్లు పడగొట్టిన రికార్డు పాక్ ఆలౌ రౌండర్ షాహిద్ అఫ్రిది పేరిట వుంది. తాజాగా అతడి సరసన షమీ చేరాడు.  తదుపరి బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో షమీ ఇలాగే మరోసారి నాలుగు వికెట్ల ప్రదర్శన చేస్తే అఫ్రిది రికార్డు బద్దలవుతుంది. 

ఇక ప్రపంచ కప్ లో ఐదు వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో షమీ ఆరో స్థానాన్ని ఆక్రమించాడు. అంతకుముందు 1983లో కపిల్ దేవ్, 1999లో రాబిన్ సింగ్, వెంకటేశ్ ప్రసాద్, 2003లో ఆశిష్ నెహ్రా, 2011 యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించారు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్  లో బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్‌, బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌  ల వికెట్లు పడగొట్టిన షమీ వీరి సరసన చేరిపోయాడు.