ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనే అవకాశం రావడమే చాలామంది యువ ఆటగాళ్లు అదృష్టంగా భావిస్తుంటారు. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తే వారు అభిమానుల దృష్టిలో హీరోలు అయిపోతారు. అలా ఇప్పుడు టీమిండియా బౌలర్ యజువేందర్  చాహల్ కేవలం ఒక్క మ్యాచ్ తోనే భారత క్రికెట్ ప్రియుల దృష్టిలో హీరోగా మారిపోయాడు. కేవలం అభిమానుల మనసులనే కాదు చాహల్ ప్రపంచ  కప్ రికార్డును కొల్లగొట్టాడు. 

ప్రపంచ కప్ టోర్నీలోకి ఆరంగేట్రం చేసిన మొదటి మ్యాచ్ లోనే అద్భుతం ప్రతిభ కనబర్చిన క్రికెటర్ల జాబితాలోకి చాహల్ చేరాడు. ఈ వరల్డ్ కప్ సీజన్ 12 లో భారత్ తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడింది. ఈ మ్యాచ్ లో ఆరంగేట్ర ఆటగాడు చాహల్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా ప్రపంచ కప్ టోర్నీలో అతడు మొదటి  అడుగే ఘనంగా వేశాడు.  

ఈ మ్యాచ్ అతడు 10 ఓవర్లపాటు బౌలింగ్ చేసి 51 పరుగులను సమర్పించుకుని నాలుగు కీలక  వికెట్లు పడగొట్టాడు. ఇలా ఆరంగేట్ర మ్యాచ్ లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్న రెండో భారత బౌలర్ గా చాహల్ నిలిచాడు. అతడికంటే ముందు గత ప్రపంచ కప్ ఆరంగేట్ర మ్యాచ్ లో మహ్మద్ షమీ కేవలం 35 పరుగులు మాత్రమే  ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బౌలర్ గా చాహల్ నిలిచాడు. 

మొదట బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కు బుమ్రా ఆరంభంలోనే దెబ్బతీశాడు. అతడు ఓపెనర్లు ఆమ్లా, డికాక్ ల పనిపట్టగా ఆ తర్వాత పనంతా చాహల్ చూసుకున్నాడు. వరుసగా డసెన్‌, డుప్లెసిస్‌, డేవిడ్‌ మిల్లర్‌, ఫెలుక్వాయో వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ నడ్డి విరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ రోహిత్ అద్భుత సెంచరీతో మెరవడంతో టీమిండియా ఈ ప్రపంచ కప్ సీజన్లో మొదటి విజయాన్ని అందుకుంది.