ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాలో ఆటగాళ్ల గాయాలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ ఓపెనర్  శిఖర్ ధావన్ బొటనవేలి గాయం కారణంగా ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో బౌలర్ భువనేశ్వర్ గాయపడి తదుపరి రెండు మ్యాచులకు దూరమయ్యాడు. ఇలా ఇప్పటికే ఓ బ్యాట్ మెన్ ఓ బౌలర్ గాయపడి టీమిండియా దూరమవగా తాజాగా ఓ ఆల్ రౌండర్ కూడా గాయం బారిన పడ్డాడు. అయితే ఈ గాయానికి మన బౌలరే కారణమవడం విచిత్రం.

అప్ఘానిస్తాన్ తో శనివారం జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో సాధన చేస్తుండగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయపడ్డాడు. యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా బౌలింగ్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ గాయమైంది. బుమ్రా వేసిన యార్కర్ ను శంకర్ అంచనావేయలేకపోవడంతో ఆ బంతి  నేరుగా వెళ్లి అతడి కాలికి తాకింది. దీంతో నెట్స్ లోనే కుప్పకూలిన నొప్పితో విలవిల్లాడిపోయిన అతడికి టీమిండియా వైద్యబృందం ప్రథమ చికిత్స అందించారు. 

అయితే ఈ గాయంపై తాజాగా బుమ్రా స్పందించాడు. తన బౌలింగ్ లో విజయ్ గాయపడటం చాలా బాధగా వుందన్నాడు.  అయితే ఎవరినీ గాయపర్చాలని తాము బంతులు విసరమని...బ్యాట్ మెన్ పరుగులు సాధించకుండా,  వికెట్ పడగొట్టడానికే బౌలింగ్ చేస్తామని తెలిపాడు. తాను నెట్స్ లో ఎదో సరదాగా ప్రాక్టీస్ చేయనని...మైదానంలో ఎంత సీరియస్ గా బౌలింగ్ చేస్తానో అక్కడా అలాగే చేస్తానన్నాడు. మరీ  ముఖ్యంగా బ్యాట్ మెన్స్ తో కలిసి ప్రాక్టీస్ చేయడానికే ఇష్టపడతానని...అలాగే శంకర్ తో కలిసి ప్రాక్టీస్ చేసినట్లు వెల్లడించాడు. 

అయితే దురదృష్టవశాత్తు అతడు గాయపడ్డాడని...అయితే ఆ గాయం అంత సీరియస్ గా ఏమీ లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి శంకర్ బాగానే వున్నాడని...ఎవరూ ఆందోళన  చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. అప్ఘానిస్తాన్ తోబ మ్యాచ్ అతడు అందుబాటులో వుంటాడన్న నమ్మకముందని బుమ్రా వెల్లడించాడు.