ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివనకు అపజయమన్నదే ఎరగని ఏకైక జట్టు భారత్. ఇలా టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోవడంతో బ్యాట్ మెన్స్ కంటే బౌలర్ల వాటానే ఎక్కువగా వుందనడంలో అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా గత రెండు మ్యాచుల్లో అయితే లో స్కోరుకే పరిమితమైన జట్టును బౌలర్లే విజయతీరాలకు చేర్చారు. ఇలా అప్ఘాన్ తో మ్యాచ్ లో షమీ హ్యాట్రిక్ ప్రదర్శనతో చెలరేగగా...విండీస్ పై బుమ్రా కొద్దిలో హ్యాట్రిక్ మిస్సయ్యాడు. అయితే తాను హ్యాట్రిక్ మిస్సవ్వడానికి గల కారణాలను తాజాగా బుమ్రా వెల్లడించాడు. 

మ్యాచ్ పరిస్థితులను బట్టి హ్యాట్రిక్ వికెట్ కోసం తాను ఓ వ్యూహం రచించినట్లు బుమ్రా తెలిపాడు. '' మొదట బ్రాత్ వైట్ ఆ  వెంటనే అలెన్ ను ఔట్ వరుస బంతుల్లో ఔట్ చేసిన  వెంటనే బౌలర్ కీమర్ రోచ్ క్రీజులోకి వచ్చాడు. అతడు స్వతహాగా బౌలర్ కాబట్టి నేను హ్యాట్రిక్ సాధించేందుకు యార్కర్ బంతిని సంధిస్తానని ఊహిస్తాడు. కాబట్టి అలా కాకుండా ఓ స్లో బంతితో అతన్ని బోల్తా కొట్టించాలని అనుకున్నా. అయితే అనుభవజ్ఞుడైన రోచ్ ఆ విషయాన్ని పసిగట్టినట్లున్నాడు. దాన్ని కూడా చాలా బాగా అడ్డుకున్నాడు.'' అని బుమ్రా తెలిపాడు. 

అయితే హ్యాట్రిక్ సాధించకున్నా కీలక సమయంలో వికెట్లు పడగొట్టినందుకు చాలా సంంతోషమేసిందని అన్నాడు. ప్రతిసారి మన వ్యూహాలన్ని ఫలించాలని లేదని...ఒక్కోసారి అవి విపలమవుతాయని తెలిపాడు. అలాంటి సంఘటనల వల్ల మనం మరిన్ని పాఠాలు నేర్చుకుని రాటుదేలే అవకాశాలుంటాయని బుమ్రా అన్నాడు.