ప్రపంచ కప్ టోర్నీలో యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రిత్ సింగ్ బుమ్రా హవా కొనసాగుతూనే వుంది. లీగ్ దశలో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో  బుమ్రా టీమిండియాను సెమీస్ చేర్చడంతో కీలక పాత్ర పోషించాడు. ఎనిమిది మ్యాచుల్లో 17 వికెట్లు పడగొట్టిన టాప్ వికెట్ టేకర్స్ లో ఒకడిగా నిలిచాడు. తాజాగా మాంచెస్టర్ వేదికన జరుగుతున్న సెమీ ఫైనల్లో కూడా అతడి హవా కొనసాగుతోంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ ద్వారా బుమ్రా ఓ అరుదైన ప్రపంచ కప్ రికార్డును నెలకొల్పాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ను బుమ్రా ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ ను కేవలం ఒక్క పరుగు వద్దే పెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత కూడా చాలా పొదుపుగా  బౌలింగ్ చేస్తూ కివీస్ జట్టు తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఎనిమిది ఓవర్లపాటు బౌలింగ్ చేసిన కేవలం 25 పరుగులే ఇచ్చి 1వికెట్ పడగొట్టాడు. అయితే ఆ ఎనిమిది ఓవర్లలో ఓ మెయిడెన్ కూడా వుంది. దీంతో ఇంగ్లాండ్ లో జరుగుతున్నఈ  ప్రపంచ కప్ లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన క్రికెటర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. 
 
ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ లోొ తొమ్మిది మ్యాచులాడిన బుమ్రా తొమ్మిది మెయిడెన్ ఓవర్లు వేశాడు. దీంతో అత్యధిక మెయిడెన్లు వేసిన తొలి బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఇతడి తర్వాత ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 8 మెయిడెన్ ఓవర్లతో రెండో స్థానంలో నిలిచాడు. 

అయితే ఈ మ్యాచ్ ఇంకా బుమ్రా రెండు ఓవర్ల బౌలింగ్ చేయాల్సివుంది. కివీస్  46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద వుండగా మ్యాచ్ కు వర్షం అడ్డంకి సృష్టించింది. దీంతో మ్యాచ్ కొద్దిసేపటి క్రితం నిలిచిపోయింది.