ఐసిసి ప్రపంచ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు శిఖర్ ధావన్ గాయంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ధవన్ సెంచరీతో అదరగొట్టి ఫామ్ లోకి రావడం అభిమానులనెంతో ఆనందాన్నించ్చింది. కానీ అది ఎంతో సేపు నిలవలేదు. ఈ సెంచరీ సాధించే క్రమంలో తీవ్రంగా గాయపడ్డ అతడు ఏకంగా ప్రపంచ కప్ టోర్నీకే దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అయితే అతడి గాయంపై గానీ,  ఎన్నిరోజులు ప్రపంచ కప్ కు దూరం కానున్నాడు అన్నదానిపై కూడా ఇప్పటివరకు స్సష్టత లేదు. అటు బిసిసిఐ కానీ...ఇటు టీం మేనేజ్ మెంట్ కానీ దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ధవన్ గాయంపై తాజాగా స్పష్టతనిచ్చాడు. 

ప్రస్తుతం శిఖర్ ధావన్ టీమిండియా వైద్య బృందం పర్యవేక్షణలో వున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. అతడి గాయం, జట్టులోకి ఎప్పుడు చేరనున్నాడన్న దానిపై మరో 10-12 రోజుల్లో స్పష్టతవచ్చే అవకాశముందన్నాడు. కాబట్టి  అప్పటిలోపు టీమిండియా ఆడే అన్ని మ్యాచులకు ధవన్ దూరం కానున్నాడని సంజయ్ వెల్లడించాడు. 

జూన్ 13 న్యూజిలాండ్, జూన్ 16 పాకిస్తాన్ తో జరిగే మ్యాచులతో పాటు జూన్ 22,27 తేదీల్లో జరిగే అప్ఘానిస్తాన్,  వెస్టిండిస్ మ్యాచులకు కూడా ధవన్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని  అన్నాడు. అయితే ఈ నెల 30 న ఇంగ్లాండ్ తో జరిగే కీలక మ్యాచ్ కు ధవన్ అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఇదే ఆశ జట్టు సభ్యులకు, టీంమేనేజ్ మెంట్ కు కూడా వుందని సంజయ్ వెల్లడించాడు.