ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు టీమిండియా చేతిలో మొదటి ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఇదే మ్యాచ్ ఆ జట్టుకు మరో నష్టాన్ని కూడా కలిగించింది. ఈ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన ఆసిస్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినీస్ జట్టుకు దూరమవనున్నట్లు సమాచారం. పాకిస్థాన్ తో జరిగనున్న తర్వాత మ్యాచ్ లో ఆసిస్ అతన్ని పక్కనపెట్టి మార్ష్ ను జట్టులోకి తీసుకోనుంది. ఈ మేరకు ఆసిస్ మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. 

గత ఆదివారం ఓవల్ వేదికగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో స్టోయినీస్ గాయపడ్డాడు. అతడికి పక్కటెముకల్లో తీవ్ర గాయమైనట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో కొద్దిరోజులు అతడికి విశ్రాంతి అవసరమని తెలపడంతో ఆసిస్ మేనేజ్ మెంట్ అతన్ని పక్కకు పెట్టింది. దీంతో రేపు (బుధవారం) టౌన్టన్ లో పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ కు స్టోయినీస్ దూరమయ్యాడు. 

ఇప్పటికైతే స్టోయినీస్ అన్ ఫిట్ గా వున్నాడని... రేపు మ్యాచ్ కు ముందు అతడికి మరోసారి ఫిట్ నెస్ పరీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆసిస్ మేనేజ్ మెంట్ తెలిపింది. అయితే ముందుజాగ్రత్తగా  మార్ష్ ను ఇంగ్లాండ్ కు రావాల్సిందిగా వారు మార్ష్ ని ఆదేశించారు. దీంతో అతడు పాకిస్తాన్ తో మ్యాచ్ కు అందుబాటులో వుండనున్నాడు.