ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియా విజయాబాటలో నడుస్తోంది. వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఓడించి తన సత్తా చాటింది. అయితే సఫారీలపై సాధించిన విజయం కంటే ఆసిస్ పై అందకున్న విజయం టీమిండియా ఆటగాళ్లలో ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే ఈ మ్యాచ్ లో తన ధనాధన్ ఇన్సింగ్స్ తో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా భారత్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. చివరి నిమిషంలో  కేవలం 27 బంతుల్లోనే 48 పరుగులు చేసిన అతడి విద్వంసకర బ్యాటింగ్ కు ఆసిస్ దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా కూడా ఫిదా అయిపోయాడు. 

తాను ప్రాతినిధ్యం వహించిన ఆసిస్ జట్టుపై ప్రత్యర్థి ఆటగాళ్లు ఆదిపత్యం ప్రదర్శిస్తే తనకు నచ్చదన్నారు. కానీ మొన్న (ఆదివారం) టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం హార్దిక్ పాండ్యా మా బౌలర్లపై విరుచుకుపడుతుంటే మాత్రం తనకెందుకో చాలా నచ్చింది. అతడి ఆటతీరుకు నేను ఫిదా అయిపోయానని స్టీవ్ వా వెల్లడించారు. 

ఈ ప్రపంచ కప్ లో హార్దిక్ ఆటతీరును చూశాక తనకు సౌతాఫ్రికా లెజండరీ ఆల్ రౌండర్ క్లుసెనర్ ఆట గుర్తొచ్చిందన్నాడు. ఇప్పుడు టీ20ల ప్రభావంతో ప్రతి ఆటగాడు దాటిగా ఆడుతున్నారు...కానీ ఈ ప్రభావమేమీ లేని 1999 సమయంలో క్లుసెనర్ విద్వంసం సృష్టించేవాడు. తాజాగా అతడి ఆటతీరుకు తగ్గట్లుగానే పాండ్యా ఇన్నింగ్స్ సాగిందన్నాడు. బలమైన బౌలింగ్ విభాగాన్ని కలిగిన  ఆసిస్ పై అతడిలా ఆడటం ఆశ్యర్యానికి గురిచేసిందని స్టీవ్ వా అన్నాడు.