ప్రపంచ కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు అందుకు తగ్గట్లుగానే వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఎలాగైనా గెలిచి చిరకాల వాంఛ నెరవేర్చుకోవాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. అయితే ఆ జట్టు విజయయాత్రకు ఉపఖండ దేశాలు అడ్డుతగులుతున్నాయి. ఇంతకుముందే పాక్ ఇంగ్లాండ్ ను ఓడించగా తాజాగా శ్రీలంక కూడా అదే పని చేసింది. 

అయితే ఆతిథ్య ఇంగ్లాండ్ పై  శ్రీలంక గెలిచింది అనేబదులు సీనియర్ బౌలర్ లసిత్ మలింగ జట్టును గెలిపించాడు అనడం సబబుగా వుంటుందేమో. ఈ మ్యాచ్ లో అతడి ప్రదర్శ అంత గొప్పగా సాగింది మరి. గతకొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న మలింగ ఒక్కసారి విజృంభించి ఇంగ్లాండ్ వంటి బలమైన బ్యాటింగ్ లైనఫ్ ను కుప్పకూల్చాడు. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంతకు ముందు విమర్శించినవారే ఇప్పుడు మలింగను పొగడుతున్నారు. ఈ నేపథ్యంతో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. 

గతంలో మలింగ షర్ట్ లెస్ ఫోటో ఒకటి వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అందులో అతడు బాగా లావెక్కి అన్ ఫిట్ గా కనిపించాడు. దీంతో అభిమానులు ఆ ఫోటో పై రకరకాలుగా కామెంట్స్ చేశారు. కొందరయితే మలింగ పని  అయిపోయింది...అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని కూడా ఉచిత సలహలిచ్చారు. అదే ఫోటోను తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన జయవర్ధనే మలింగకు ఈ విధంగా అభినందనలు తెలిపాడు. '' చాలా బాగా బౌలింగ్ చేశావు మలి...ఈ సమయంలో గత కొంతకాలంగా వైరల్ గా మారిన ఈ ఫోటోనే నీ ఫ్యాన్స్ తో పంచుకోవాలని భావిస్తున్నా'' అంటూ మలింగ్ పై విమర్శలు చేసిన వారికి చురకలు అంటించాడు. 
 
ఇంగ్లాండ్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి కేవలం 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆ పరుగులను ఇంగ్లాండ్ అవలీలగా ఛేదిస్తుందని     అందరూ అనుకున్నారు. అయితే లసిత్ మలింగ్, డిసిల్వాలు అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టును 212 పరుగులకే కుప్పకూల్యారు. టాప్ ఆర్డర్ ను మలింగ, లోయర్ ఆర్డర్ ను డిసిల్వా కుల్చగా మధ్యలో ఉదానా కూడా రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంకను విజయతీరాలకు చేర్చారు.