ఒకప్పుడు శ్రీలంక జట్టు జయసూర్య, ఆటపట్టు, దిల్షాన్, ముత్తయ్య మరళీధరన్, చమిందవాస్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో నిండివుండేది. దీంతో ఆ జట్టు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. అంతేకాకుండా 1996 సంవత్సరంలో అయితే అంతర్జాతీయ జట్లన్నింటిని ఓడించి  ఏకంగా వన్డే ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. ఇలాంటి జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగున్న ప్రపంచకప్ లో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎంతలా అంటే ఆ జట్టు కెప్టెన్ సైతం తాము బలహీనమైన జట్టేనని బహిరంగంగానే ఒప్పుకునేలా లంక పరిస్థితి తయారయ్యింది. 

ఈ ప్రపంచ కప్ లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లాడిన లంక కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా మిగతా రెండింటిలో ఓడిపోయింది. దీంతో లంక అభిమానుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే రేపు (శనివారం) డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనున్న నేపథ్యంలో లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే మీడియాతో మాట్లాడుతూ తన అసహనాన్నంతా బయటపెట్టాడు. తమది నిజంగానే బలహీనమైన జట్టే అంటూ స్వయంగా అతడే పరోక్షంగా ఒప్పుకున్నాడు. 

'' అభిమానులే కాదు విశ్లేషకులు, మాజీలు అందరు కలిసి ఇతర జట్ల ప్రదర్శనతో మా ప్రదర్శన పోలుస్తూ సలహాలిస్తున్నారు. అలాంటివారందనికి నేనొక్కటే చెబుతున్నా. ఎవరి బలాలు, బలహీనతలు వారికుంటాయి. దాన్ని బట్టే జట్టు ఆటతీరు వుంటుంది. టీమిండియా అద్భుతంగా ఆడుతుంది కదా అని అలా ఆడమంటే మేమెలా ఆడగలమంటూ కరుణరత్నే ఆగ్రహం  వ్యక్తం చేశాడు. 

టీమిండియా దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ కలిగింవుంది. ప్రతి మ్యాచ్ లో ఒకటి లేదా రెండు సెంచరీలు నమోదుచేస్తుంటారు. కానీ మా జట్టులో ఏడాదికో సెంచరీ నమోదవుతుంది. టీమిండియా బౌలర్లలో కూడా 140-145 కిలోమీట్లర్ వేగంతో  గతి తప్పకుండా బౌలింగ్ చేసే ప్రపంచ స్థాయి బౌలర్లున్నారు. కానీ తమ జట్టులో 130-135కీలోమీట్లర్ల వేగంతో బంతులేయడానికే బౌలర్లు ఆపసోపాలు పడతారు. కాబట్టి టీమిండియా వంటి ప్రదర్శన చేయమంటూ మాకెలా సాధ్యమవుతుంది. కానీ మా శక్తిని తగ్గట్లుగా మాత్రం ఆడగలమని మాత్రం హామీ ఇవ్వగలను.'' అంటే తిలకరత్నే అసహనం వ్యక్తం చేశాడు.