ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ప్రపంచ టోర్నీలో టీమిండియా హవా కొనసాగుతోంది. అయితే లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకుపోయిన కోహ్లీ సేన సెమీఫైనల్లోనూ అదే ఆటతీరు కనబరుస్తుందని ఆసిస్ మాజీ  కెప్టెన్ మెకెల్ క్లార్క్ జోస్యం చెప్పారు. మాంచెస్టర్ వేదికన జరుగతున్న సెమీఫైనల్లో భారత్ న్యూజిలాండ్ ను ఓడించి ఫైనల్ కు చేరడం ఖాయమని అతడు అభిప్రాయపడ్డాడు. 

'' ఇప్పటికే లీగ్ దశలో  వరుస విజయాలను అందుకుని మెన్ ఇన్ బ్లూ 15  పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని గుర్తుచేసుకున్న క్లార్క్ ఫైనల్ కు చేరడానికి భారత్ కంటే ఎక్కువ అర్హత గల జట్టు మరోటి లేదు. భారత ఆటగాళ్లు తమ సత్తా ఏంటో లీగ్ దశలోనే నిరూపించుకున్నారని...అందువల్లే ఆ జట్టు పాయింట్ టేబుల్ లో అగ్రస్థానాన నిలిచింది'' అని క్లార్క్ పేర్కొన్నాడు.

సెమీఫైనల్లో కివీస్ పై మరోసారి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చెలరేగనున్నాడని తెలిపాడు. రోహిత్ ఆడిన  ప్రతిసారీ టీమిండియా మంచి ఫలితాన్ని సాధించిందని....ఈ మ్యాచ్ లోనూ అలాగే జరుగుతుందన్నాడు. రోహిత్ ను అడ్డుకునే బౌలర్  ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లోనే లేడంటూ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

అయితే న్యూజిలాండ్ ను కూడా అంత తక్కువ అంచనా వేయలేమని...తనదైన రోజు ఎంతటి బలమైన జట్టునయినా ఓడించగల సత్తా ఆ జట్టు సొంతమన్నాడు.  అందువల్ల కివీస్ కూడా ఫైనల్ కు చేరిన ఆశ్యర్యపోవాల్సిన అవసరం  లేదన్నాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే టీమిండియాదే పైచేయిగా నిలుస్తుందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.