ప్రపంచ కప్ 2019 టోర్నీని పాక్ ఘోర ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. కనీస పోటీ కూడా ఇవ్వకుండి విండీస్ చేతిలో భారీ ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా పాక్ బ్యాటింగ్ వైఫల్యం ఈ మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది.కేవలం 105 పరుగులకే చేతులెత్తేసిన పాక్ బ్యాట్ మెన్స్ ఓటమికి కారణమయ్యారు. దీంతో సొంత అభిమానులు, మాజీల నుండి పాక్ తీవ్ర విమర్శలను ఎదుర్కుంటోంది. మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అయితే  కెప్టెన్ సర్ఫరాజ్ అంతర్జాతీయ క్రికెట్ కే అన్ ఫిట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. 

ఇలా విండీస్ పై ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ సోమవారం ఆతిథ్య  ఇంగ్లాండ్ తో  తలపడనుంది. ఈ సమయంలో అక్తర్ మరోసారి  ట్విట్ చేశాడు. అయితే ఆసారి మాత్రం విమర్శలకు దిగకుండా తీవ్ర ఒత్తిడిలో వున్న తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగేలా, ఉత్తేజాన్నిచ్చే ప్రయత్నం చేశాడు. 

''రక్తం, చెమట, కోపం, ఉరకలెత్తే గుండె చప్పుడు, బద్మాషీ. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నపుడు ఇవి మీకు(పాక్ ఆటగాళ్లకు) చాలా అవసరం. మీ గుండెలపై వున్న ఆ స్టార్ మీకు గర్వకారణం. వెళ్లండి...విజయాన్ని అందుకొండి'' అంటూ అక్తర్ పాక్ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.