ప్రపంచ కప్ ను ఘోర ఓటమితో ఆరంభించిన పాకిస్తాన్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది.  అదికూడా ఆషామాషీ జట్టుపై కాదు...టైటిల్ పేవరెట్ గా భావిస్తున్న ఆతిథ్య ఇంగ్లాండ్ పై గెలిచింది. గత మ్యాచ్ లో విండీస్ చేతిలో ఓటమిపాలైనపుడు విమర్శించిన వారే ఈ  గెలుపుతో పాక్  ను ఆకాశానికెత్తేస్తున్నారు. అలా మాజీ పాక్ స్పీడ్ బౌలర్ షోయబ్ అక్తర్  కూడా పాక్ జట్టును తాజాగా ప్రశంసలతో ముంచెత్తాడు. 

అయితే ఈ విజయాన్ని తానుమ ముందే ఊహించానని అక్తర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇంగ్లాండ్ పై పాక్ గెలుస్తుందని మే22 నే తాను చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. నేను ఊహించినట్లే పాక్ ఆతిథ్య ఇంగ్లాండ్ ను ఓడించడం  చాలా ఆనందాన్నిచ్చిందన్నాడు. ఈ విజయాన్ని పాక్ ఆటగాళ్లు పూర్తి అర్హులని అక్తర్ జట్టు సభ్యులను ప్రశంసించాడు. 

మ్యాచ్ ముగిసిన వెంటనే అక్తర్ ఓ వీడియోను సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు. అలాగే ట్విట్టర్ ద్వారా గతంలో తాను గెలుస్తుందని చెప్పిన విషయాన్ని గుర్తుచేశాడు.'' పాకిస్థాన్ గెలిచింది. ఇంగ్లాండ్ ను పాక్ ఓడిస్తుందని నేను ముందే చెప్పాను. తాను ఊహించినట్లే ఓ ఘోర  ఓటమి తర్వాత అద్భుత ప్రదర్శనతో పాక్ విజయాన్ని అందుకుంది. జట్టుతో పాటు మా కెప్టెన్ కూడా మేల్కొన్నాడు'' అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు. 

అలాగే ఈ మ్యాచ్ చివర్లో ఉత్కంఠభరితంగా సాగుతున్నపుడు టీవీలో మ్యాచ్ వీక్షిస్తున్న వీడియోను కూడా అక్తర్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ సమయంలో అతడు చాలా ఉద్వేగంగా కనిపించాడు.