పాక్ మాజీ ప్లేయర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తాజాగా మరో వివాదానికి తెరతీశాడు. పాక్ జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వసాన్ని నింపేందుకు ప్రయత్నిస్తూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ను అవమానించేలా వ్యవహరించాడు. దీంతో పీటర్సన్ కూడా అక్తర్ ట్వీట్ కు ఘాటుగా సమాధానమిచ్చాడు. ఇలా అక్తర్, పీటర్సన్ మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. 

ప్రపంచ కప్ లో తాము ఎదుర్కొన్న మొదటిమ్యాచ్ లో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది. వెస్టిండిస్ బౌలర్ల దాటికి తట్టుకోలేక కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. ఆ స్వల్ఫ లక్ష్యాన్ని విండీస్ కేవలం 14 ఓవర్లలోపై ఛేదించింది. ఇలా ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ టోర్నీలో తమ జట్టు ఘోరంగా ఓడిపోడాన్ని జీర్ణించుకోలేకపోయిన పాక్ మాజీ ఆటగాళ్లు, అభిమానులు సొంత జట్టుపైనే తీవ్ర విమర్శలు  చేశారు. 

ఇలా పాక్ మాజీ బౌలర్ అక్తర్ కూడా పాక్ జట్టుపై, కెప్టెన్ సర్ఫరాజ్ పై తీవ్ర విమర్శలు చేశాడు. అయితే తాజాగా ఇంగ్లాండ్ పై జరుగుతున్న మ్యాచ్ కు ముందు తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ  క్రమంలోనే అతడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ ను అవమానించేలా వ్యవహరించాడు. పాక్ ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూ చేసిన ట్వీట్ కు పీటర్సన్ ను తాను ఔట్ చేసి సంబరాలు చేసుకుంటున్న ఫోటోను అక్తర్ జతచేశాడు. ఇది ఫీటర్సన్ కోపానికి కారణమయ్యింది. దీంతో అతడు కూడా అదే ట్విట్టర్ వేదికన అక్తర్ కు ఘాటుగా సమాధానమిచ్చాడు.  

''ఈ ట్వీట్ గురించి నీతో వాదించుకోవాలని  అనుకోవట్లేదు బడ్డీ(అక్తర్). నేను సెంచరీ చేసిన  సమయంలో కూడా నువ్వు ఇలాగే సంబరాలు చేసుకున్నావు. గొప్ప ప్యాషన్'' అంటూ అక్తర్ కు చురకలంటించాడు. దీంతో విషయం సీరియస్ అవుతుందని గమనించిన అక్తర్ తెలివిగా పీటర్సన్ నుహ శాంతింపజేసేందుకు సరదా మాటలకు దిగాడు.'' నువ్వు(పీటర్సన్) నిజమైన పోరాట  యోధుడివి. కానీ నా  బౌలింగ్ ఔటయినప్పటికి నా చికెన్  డ్యాన్స్ ను నువ్వు ఇష్టపడేవాడివి'' అంటూ మరో ట్వీట్ చేశాడు. 

 

చివర్లో పీటర్సన్ ''లవ్ యూ బడ్డి'' అని ట్వీట్ చేయగా అక్తర్ '' నీ తరహాలోనే ప్రేమను పంపిస్తున్నా'' అంటూ లవ్ సింబల్ ను జతచేస్తూ సమాధానమిచ్చాడు. ఇలా వాడివేడిగా ప్రారంభమైన ఈ ట్విట్టర్ యుద్దం చివరకు ప్రశాంతంగా ముగిసింది.